మెగాస్టార్ చిరంజీవి మరోసారి రాజ్యసభకు వెళ్లనున్నారు. ఎన్డీయే తరపున ఆయనకు కేంద్ర కేబినెట్‌లో కూడా చోటు దక్కనుందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన ఏ పార్టీ నుంచి రాజ్యసభకు వెళ్తారనే ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయంగా కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కనీసం ఎమ్మెల్సీగా కూడా ఎన్నిక కాని మెగా బ్రదర్ నాగబాబును మంత్రి వర్గంలోకి తీసుకోవాలని ఇప్పటికే చంద్రబాబు నిర్ణయం తీసుకోగా.. ఇప్పుడు ఎలాంటి పదవి లేని మెగాస్టార్‌ను ఏకంగా కేంద్ర మంత్రిని చేస్తారనే చర్చ జరుగుతోంది. అయితే ఆయనకు ముందుగా ఎంపీ పదవి ఇచ్చి రాజ్యసభకు పంపుతారని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
చిరంజీవికి ఎంపీ పదవి ఏ పార్టీ నుంచి దక్కుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జనసేన తరపున ఆయన పెద్దల సభలోకి అడుగు పెడతారని ఒక వర్గం చెబుతుండగా.. బీజేపీ ఆయనకు ఎంపీగా అవకాశం ఇస్తుందనేది మరో వర్గం వాదనగా ఉంది. చిరంజీవి గతంలో తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినందుకు ప్రతిఫలంగా.. రాజ్యసభ సభ్యత్వంతో పాటు కేంద్ర మంత్రి పదవి కూడా పొందారు. అప్పట్లో కాంగ్రెస్ తరపున బలమైన వాయిస్‌నే వినిపించిన చిరంజీవి.. తర్వాత రాజకీయాలు మానేసి సినిమాలు చేసుకుంటున్నారు. తమ్ముడు పవన్ కల్యాణ్ తరపున కూడా ఆయన ఏనాడూ ఎన్నికల ప్రచారం చేయలేదు. దీంతో ఆయన జనసేన పార్టీలో చేరే అవకాశం లేదని తెలుస్తోంది.
సినీ ఇండస్ట్రీ సెకండ్ ఇన్నింగ్స్ హిట్‌తో స్టార్ట్ అయినప్పటికీ ప్రస్తుతం కెరీర్ ఒడిదుడుకుల్లో ఉంది. అందుకే మళ్ళీ ఆయన చూపు రాజకీయాల వైపు పడిందని సమాచారం. అందులో భాగంగానే రాజకీయ నాయకులతో సత్సంబంధాలు స్టార్ట్ చేశారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇటీవల సంక్రాంతి సంబరాల కోసం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ నివాసంలో నిర్వహించిన వేడుకల్లో కూడా చిరు పాల్గొనడం ఇందులోని భాగమేన్న వాదన వినిపిస్తోంది. ఆ సమయంలోనే బీజేపీ నేతలతో తన రీ ఎంట్రీ గురించి ప్రస్తావించినట్లు సమాచారం.
కేంద్రంలో బీజేపీ బలంగా ఉంది. అదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా వరుసగా గెలుస్తూ వస్తోంది. కానీ దక్షిణాదిలో మాత్రం బీజేపీ పాగా వేయలేకపోతోంది. ఒక్క కర్ణాటకలో తప్ప.. బీజేపీకి మరే రాష్ట్రంలోనూ తగినంత బలం లేదు. ఈ క్రమంలో దక్షిణాదిన పాపులర్ నాయకులతో పార్టీని బలోపేతం చేయాలని భావిస్తోంది. ఇప్పటికే జనసేనతో పొత్తు పెట్టుకున్న తర్వాత బీజేపీ వాయిస్ బలంగా వినిపిస్తోంది. పవన్ కల్యాణ్ కూడా బీజేపీ భావజాలానికి అనుగుణంగానే రాజకీయాలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు నాగబాబు, చిరంజీవిలను రంగంలోకి దించడం ద్వారా దక్షిణాదిలో మిగిలిన రాష్ట్రాల్లో కూడా పాతుకొని పోవాలని అంచనా వేస్తోంది.
అయితే చిరంజీవి.. ఒక రాజకీయ పార్టీలో చేరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగడానికి ఇష్టపడటం లేదని తెలుస్తోంది. ప్రజారాజ్యం పార్టీ విలీనం తర్వాత రాజకీయాలంటే చిరంజీవికి విరక్తి పుట్టాయి. అందుకే వైసీపీ రాజ్యసభ స్థానం ఆఫర్ చేసినా చిరు నో చెప్పేశారు. తాను ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని తేల్చి చెప్పారు. కానీ పవన్ కల్యాణ్ బలవంతం చేయడం వల్లే ఇప్పుడు ఎంపీ పదవికి ఒప్పుకున్నట్లు తెలిసింది. అయితే చిరంజీవి ఏ పార్టీలో చేరడానికి కూడా ఇష్టపడక పోతే బీజేపీ ప్లాన్ బి అమలు చేయాలని భావిస్తోందట.
చిరంజీవిని అవసరం అయితే రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు పంపాలని ప్లాన్ చేస్తున్నారట. కళాకారుల కోటాలో చిరంజీవికి ఎంపీ పదవి ఇచ్చే అవకాశం ఉంది. అందుకే బీజేపీ పెద్దలతో ఇదే విషయాన్ని పవన్ కల్యాణ్ కూడా చర్చించినట్లు తెలిసింది. బీజేపీ కూడా ఈ ప్రతిపాదనకు సానుకూలంగా ఉన్నదట. మొత్తానికి చిరంజీవి రాజ్యసభకు వెళ్లడం అయితే ఖాయంగానే కనిపిస్తోంది. అయితే ఆయనను పెద్దలకు సభకు పంపే పార్టీ ఏంటనే విషయంపై మాత్రం కొంత కాలం డైలమా కొనసాగనున్నది.