దావోస్‌లో మూడో రోజు ప్రపంచ ఆర్థిక సదస్సు కొనసాగుతోంది. పెట్టుబడులకు ఆకర్షించేందుకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పోటీపడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు వరుస భేటీలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. మూడోరోజు ఏపీ సీఎం చంద్రబాబు పలు అంతర్జాతీయ దిగ్జజ సంస్థల సీఈఓలతో భేటీ కానున్నారు. ఇవాళ ఏపీకి సంబంధించి పలు కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది.
ఇక ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర రవాణా కంపెనీలలో ఒకటైన డెన్మార్క్‌కు చెందిన మార్స్క్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తోంది. 130 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ, ప్రపంచ రవాణా రంగంలో రారాజులా వున్న మార్స్క్ రాష్ట్రానికి వస్తే సముద్రరవాణాలో ఏపీ దేశంలోనే అగ్రగామి రాష్ట్రం అవుతుంది.
మరోవైపు దావోస్‌లో మంత్రి నారా లోకేష్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. హిటాచీ ఇండియా ఎండీ భరత్ కౌశల్‌తో లోకేష్ భేటీ అయ్యారు. HVDC సాంకేతికత అమలులో సహకరించాలని కోరారు. అలాగే WTCA గ్లోబల్ చైర్మన్ జాన్ డ్రూతో లోకేష్ సమావేశమయ్యారు. ఏపీలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ల ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు.
ఇక ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో తెలంగాణ రైజింగ్ నినాదంతో సీఎం రేవంత్ రెడ్డి బృందం వరస భేటీలు, చర్చలు జరుపుతోంది. దావోస్ ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులోని గ్రాండ్ ఇండియన్ పెవిలియన్‌లో ప్రత్యేకంగా తెలంగాణ పెవిలియన్ ఏర్పాటు చేశారు. దావోస్‌లో ఇవాళ మరో కీలక కంపెనీతో ఒప్పందం చేసుకుంది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ నగరంలో టెక్ సెంటర్ ఏర్పాటుకు HCL తో ప్రభుత్వం ఎంవోయూ చేసుకుంది. తెలంగాణ పెవిలియన్ లో సీఎం రేవంత్‌తో HCL సీఈవో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. అనంతరం చర్చలు సఫలం కావడంతో సదరు కంపెనీతో తెలంగాణ ప్రభుత్వం ఎంవోయూ చేసుకుంది. దీంతో హైటెక్ సిటీలో దాదాపు 3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో HCL క్యాంపస్ నిర్మించనున్నారు.