స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నంద్యాల చేరుకున్న సందర్భంగా టీడీపీ నేతలు భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ జరగడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. ముగ్గురు సీనియర్లతో కూడిన త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. నంద్యాల ఘర్షణ ఘటనపై సమగ్ర అధ్యయనంతో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పార్టీ లైన్ దాటితే ఎంతటివారైనా ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ కార్యక్రమాల్లోకి వైసీపీ శ్రేణులు చొరబడే ప్రమాదం ఉందని.. నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కాగా లోకేశ్ పాదయాత్ర మంగళవారం నంద్యాల నియోజకవర్గంలోకి ప్రవేశించిన సందర్భంగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులు స్వాగత ఏర్పాట్లు చేశారు. ఇదే సమయంలో ఇరు వర్గాల మధ్య జరిగిన వాగ్వాదం కాస్త ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో సుబ్బారెడ్డిని అఖిలప్రియ వర్గీయులు కొట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు అఖిలప్రియను అరెస్ట్ చేశారు.


