స్వతంత్ర, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ టూర్ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా బాబు పర్యటనపై ఏపీ పాలిటిక్స్‌లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ కావడం, నేడు ప్రధాని మోదీని కలవనుండడం ఆసక్తి రేపుతోంది. శనివారం రాత్రి అమిత్ షాతో భేటీ అయిన చంద్రబాబు దాదాపు గంటపాటు ఆయనతో చర్చలు జరిపారు. ఈ భేటీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు. ఏపీ, తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులు, పొత్తులపై ప్రధానంగా చర్చించుకున్నట్లు తెలుస్తోంది. విభజన హామీలు, ప్రత్యేక హోదా ఇవ్వనందుకు 2018లో ఎన్డీఏ నుంచి వైదొలిగాక తొలిసారి బీజేపీ అగ్ర నేతలతో బాబు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా ఏపీలో ముందస్తు ఎన్నికలు, రెండు రాష్ట్రాల్లో పొత్తులపై క్లారిటీ తెచ్చుకోవడమే లక్ష్యంగా ఈ భేటీలు జరుగుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోండగా.. ఏపీలో జగన్‌ను ఓడించి అధికారాన్ని దక్కించుకోవాలని టీడీపీ భావిస్తోంది. తెలంగాణలో టీడీపీ కొన్నిచోట్ల బలంగా ఉండటంతో బీజేపీ పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలాగే ఏపీలో అధికారంలోకి రావాలంటే బీజేపీ అవసరం టీడీపీకి ఉంది. దీంతో పరస్పర ప్రయోజనాల దృష్ట్యా రెండు పార్టీలు మళ్లీ కలవాలని చూస్తోన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆంధ్రాలో టీడీపీ-జనసేన-బీజేపీ.. తెలంగాణలో టీడీపీ-బీజేపీ కలిసి ఎన్నికలకు వెళ్తాయో లేదో మరికొన్ని రోజులు వేచి చూడాలి.