దావోస్‌లో మంత్రి టీజీ భరత్ చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. మనం ఎక్కడికి వచ్చాం… ఏం మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జ్యూరిక్‌లో తెలుగు డయాస్పోరా కార్యక్రమం అయిన తర్వాత భరత్‌ను పిలిచి మందలించారు. మంత్రులు బాధ్యతగా వ్యవహరించాలని… ఎప్పుడు… ఏం మాట్లాడాలో ముందు తెలుసుకోవాలని హితవు పలికారు. భవిష్యత్తులో లోకేశ్ సీఎం అవుతారనే వ్యాఖ్యలు ఇక్కడ అవసరమా అని మండిపడ్డారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు వచ్చామని.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కాదుగా అంటూ ఫైర్ అయ్యారట. మున్ముందు ఈ తరహా వ్యాఖ్యలు చేయవద్దని గట్టిగా చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు బృందం దావోస్ పర్యటనకు వెళ్లింది. అక్కడ తెలుగు పారిశ్రామిక వేత్తలతో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్‌లు సమావేశమయ్యారు. ఏపీ ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలకు ఇస్తున్న వెలుసుబాటును వివరించారు. ఆ సమయంలో టీజీ భరత్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఎవరికి నచ్చినా, నచ్చక పోయినా పార్టీ భవిష్యత్తు నాయకుడిగా, భవిష్యత్తులో కాబోయే సీఎం లోకేశ్ అని వ్యాఖ్యానించారు టీజీ భరత్. ఈ విషయమై కార్యక్రమం అయిన వెంటనే సీఎం చంద్రబాబు మంత్రిని మందలించారు.
ఇక నాలుగైదు రోజులుగా నారా లోకేశ్ డిప్యూటీ సీఎం అంటూ పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు, టీడీపీ రాష్ట్ర నాయకులు ప్రచారం చేశారు. మంత్రి నారా లోకేష్‌ను ఉప ముఖ్యమంత్రి చేయాలని TDP క్షేత్రస్థాయి లీడర్ల నుంచి రాష్ట్ర స్థాయి లీడర్ల వరకు అందరూ డిమాండ్ చేస్తున్నారు. నారా లోకేష్‌ను ఉప ముఖ్యమంత్రి చేయాలని డిమాండ్ చేసిన నేతల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్ వర్మ కూడా ఉన్నారు. టీడీపీకి కోటి సభ్యత్వాలు చేయించిన నారా లోకేష్ డిప్యూటీ సీఎం పదవికి వందశాతం అర్హులు అని అన్నారు. తాజాగా.. ఈ అనూహ్య పరిస్థితిపై టీడీపీ అధిష్టానం స్పందించింది. ఆ డిమాండ్‌ను లేవనెత్తిన లీడర్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఏడాది కూడా పూర్తవకముందే ఇలాంటి పరిస్థితులు తీసుకురావడం కరెక్ట్ కాదని చురకలు అంటించింది. ప్రజలు మనమీద పెద్ద బాధ్యతను పెట్టారని… మన బాధ్యత అభివృద్ధి, సంక్షేమ అని అన్నారు. ఈ అంశంపై ఇక నుంచి నేతలెవరూ అత్యుత్సాహం ప్రదర్శించొద్దని స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. కూటమి నేతలు మాట్లాడుకున్నాకే ఏదైనా నిర్ణయాలుంటాయని ప్రకటన చేసింది.
నిన్న సాయంత్రానికి టీడీపీ అధిష్ఠానం డిప్యూటీ సీఎం ప్రచారాన్ని ఆపాలంటూ ఆదేశాలిచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే టీజీ భరత్ ఏకంగా నారా లోకేశ్ సీఎం అవుతారని మాట్లాడటం వివాదాలకు దారితీసింది. ఒక ఇష్యూను వదిలించుకుందామనుకునే లోపే మరో ఇష్యూ తెలుగుదేశం అధిష్ఠానం మెడకు చుట్టుకున్నట్లు అయింది.