స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్‌లో వాలంటీర్ల సేవా పురస్కారాల కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రజలకు వలంటీర్లు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా వారికి వందనం చెప్పడమే ఈ కార్యక్రమ ఉద్దేశ్యం అని అన్నారు. వరుసగా మూడో ఏడాది గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులను ఇచ్చే కార్యక్రమం జరుపుకోవడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ వాలంటీర్లకు సీఎం జగన్ సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పురస్కారాలు ప్రదానం చేసి సత్కరించారు.
అనంతరం సీఎం మాట్లాడుతూ.. వాలంటీర్ల వ్యవస్థకు అడ్డంకి ఎప్పటికీ ఉండదని వ్యాఖ్యానించారు. మంచి చేస్తున్న ప్రభుత్వానికి వాలంటీర్లు బ్రాండ్ అంబాసిడర్లు. ఏ పార్టీ వ్యక్తి అయినా ప్రభుత్వ పథకం అందాలి.. అందుకే వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చామని అన్నారు. చంద్రబాబుకి వాలంటీర్ల వ్యవస్థ అంటే కడుపు మంట. అందుకే వాలంటీర్లకు దురుద్దేశాలు ఆపాదిస్తున్నారని మండిపడ్డారు. తులసి మొక్క లాంటి వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అని కొనియాడారు.
ప్రభుత్వం చేసిన పని ప్రతి ఒక్కరికీ చెప్పాల్సిన బాధ్యత వాలంటీర్లపై ఉందని సూచించారు. అన్యాయమైన రాజకీయాల మధ్య మనం ఉన్నామని.. పేదల ప్రభుత్వంపై అసత్య ప్రచారాలను చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వారదులు, సంక్షేమ సారథులు ఈ వాలంటీర్లు అని కొనియాడారు. సేవకులు, సైనికులు ఈ వాలంటీర్లు.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్న సైన్యం వాలంటీర్లు.. రాజకీయం చూడకుండా అందరికీ సంక్షేమం అందిస్తున్నది వాలంటీర్లు అంటూ వలంటీర్ల గొప్పతనాన్ని వివరించారు సీఎం జగన్. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు పాల్గొన్నారు.


