స్వతంత్ర వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా వినుకొండలో రెండు రోజుల క్రితం వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కారు ముందు టీడీపీ కార్యకర్తలు అరాచకం సృష్టించారు. పోలీసులు అక్కడి చేరుకుని పరిస్థితులు అదుపులోకి తెచ్చారు. ఇక శుక్రవారం మంత్రి అంబటి రాంబాబు వినుకొండలో పర్యటించారు. వినుకొండలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడితో కలిసి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు తాను అధికారంలో లేకపోతే రాష్ట్రమంతా హింస చెలరేగాలని కోరుకుంటారని, అది ఆయన నైజమని రాంబాబు అన్నారు.
వినుకొండలో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాని ఆయన తెలిపారు. స్థానికులకు వాస్తవాలేంటో స్పష్టంగా తెలుసని, పోలీసులు గాలిలోకి కాల్పులు జరపకపోయి ఉంటే అక్కడ ఘోరంగా ఉండేదని ఆయన అన్నారు. ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు వల్లభ డెయిరీ ఫామ్ లోకి గోడలు దూకి మరీ వెళ్లి ఫోటోలు తీసి సెల్ఫీ ఛాలెంజ్ చేశారని, ఎమ్మెల్యే ఫామ్ నిర్మాణం కోసం గోతులు తవ్వి, మట్టి బయటకు తీశారని, దీన్ని ఆసరాగా చేసుకుని మట్టిని వేరేచోటకు తరలిస్తున్నారంటూ జీవీ ఆంజనేయులు, టీడీపీ నేతలు యాగీ చేశారని మంత్రి ఫైర్ అయ్యారు.
ఇంకా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ..” ఇటీవలే చంద్రబాబు టీవీ సీరియల్ లాగా పోలవరం, వ్యవసాయం, రాయలసీమ పరిస్థితులపై ఎల్లో మీడియాలో సుదీర్ఘ ప్రసంగాలు ప్రసారం చేస్తున్నారు. వ్యవసాయంపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు. పోలవరాన్ని రామోజీరావు బంధువైన నవయుగ కంపెనీకి ధారాదత్తం చేసి పోలవరాన్ని ఏటీఎం లాగా వాడుకున్నారు. 14 ఏళ్లు ఏపీకు పట్టిన చంద్రబాబు అనే శనిని వైఎస్ వదిలించారు. మరలా 2019లో వైఎస్ జగన్ ఇంటికి పంపారు. బాబు అధికారంలో ఉన్నప్పుడు ఏపీలో 300 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు. అదే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క కరువు మండలం లేదు” అంటూ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.