గల్ఫ్ దేశాల్లో చట్టాలు చాలా భిన్నంగా ఉంటాయి. గల్ఫ్ దేశాల్లో ఒకటైన ఖతార్‌లో అల్ దహ్రా గ్లోబల్ అనే ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్న మన నేవీ మాజీ అధికారులకు గూఢచర్యం ఆరోపణల కేసులో మరణశిక్ష విధించడం సంచలనంగా మారింది. 8 మంది భారత మాజీ నేవీ అధికారులకు ఖతార్ న్యాయస్థానం మరణ శిక్ష విధించడంపై భారత ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. 8 మంది మాజీ నేవీ అధికారుల కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటించింది. పూర్తి తీర్పు కోసం ఎదురు చూస్తున్నట్లు ప్రకటించింది. ఈ కేసుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుమన్నామని.. 8 మంది కుటుంబ సభ్యులతో, న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. కాగా ఈ 8 మందిని విడుదల చేయించి, దోహా నుంచి భారత్‌కు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులతోపాటు వారి సన్నిహితులు, శ్రేయోభిలాషులు కేంద్రాన్ని కోరుతున్నారు.
మరణ శిక్ష ఎవరెవరికి?
ఖతార్ కోర్టు మరణ శిక్ష విధించిన వారిలో నవతేజ్ సింగ్ గిల్, బీరేంద్ర కుమార్ వర్మ, సౌరభ్ వశిష్ట్ గతంలో భారత నేవీలో కెప్టెన్లుగా పని చేయగా.. అమిత్ నాగ్‌పాల్, పూర్ణేందు తివారీ, సుగుణాకర్ పాకాల, సంజీవ్ గుప్తా కమాండర్లుగా సేవలు అందించారు. రాగేష్ సెయిలర్‌గా పని చేశారు. ఖతార్ నేవీకి శిక్షణ ఇచ్చే ఓ ప్రయివేట్ సంస్థలో వీరంతా పని చేసేవారు. వీరిలో సుగుణాకర్ పాకాల విశాఖపట్నానికి చెందిన వ్యక్తి.
సుగుణాకర్ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు..?
సుగుణాకర్ పాకాల సహా 8 మంది భారత మాజీ నేవీ అధికారులకు ఖతార్‌లో మరణ శిక్ష పడిన నేపథ్యంలో.. విశాఖలో నివాసం ఉంటోన్న ఆయన బావమరిది కళ్యాణ చక్రవర్తి మీడియాతో మాట్లాడారు. ఖతార్ జైల్లో ఉన్న సుగుణాకర్‌తో ఆయన భార్య మినహా మరెవరికీ మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదన్నారు. ఇండియన్ నేవీలో పని చేసిన సుగుణాకర్ 2013లో రిటైర్ అయ్యారని.. తర్వాత ఖతార్‌కు చెందిన అల్ దహ్రా కంపెనీలో ఉద్యోగంలో చేరారని ఆయన తెలిపారు. ఆ సంస్థలో పని చేస్తున్న సమయంలోనే ఆయన్ను దోహాలో అరెస్ట్ చేశారని తెలిపారు. ఆయన అరెస్ట్‌కు సంబంధించిన మీడియాలో జరుగుతోన్న ప్రచారం వాస్తవం కాదన్నారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావును సుగుణాకర్ కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇటీవల విశాఖపట్నంలో కలిశారు. వారికి న్యాయం జరిగేందుకు భారత ప్రభుత్వం అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తుంది ఆయన భరోసా ఇచ్చారు.
15 రోజుల్లోగా అప్పీల్ చేసే అవకాశం
ఖతార్‌లో మరణ శిక్ష పడిన తమ వారిని కాపాడాలని వారి కుటుంబీకులు కేంద్రాన్ని కోరుతున్నారు. విదేశాంగ శాఖ జోక్యం చేసుకొని దౌత్య మార్గంలో వారి విడుదలకు ప్రయత్నించాలని కోరుతున్నారు. అయితే ఖతార్ న్యాయస్థానం వారికి ఎందుకు మరణ శిక్ష విధించిందనే పూర్తి వివరాలను బయటకు రాలేదు. ఈ వివరాలను ఆదివారం భారత విదేశాంగ శాఖకు అందజేయనున్నారు. తర్వాత 15 రోజుల్లోగా ఖతార్ కోర్టులో అప్పీల్ చేసే అవకాశం ఉంటుంది. 8 మంది భారతీయులకు మరణ శిక్ష విధించిన విషయాన్ని ప్రధాని మోదీ ఖతార్ ఎమిర్‌తో మాట్లాడి, వారిని విడుదల చేసే విషయమై మాట్లాడాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
ఆన్‌లైన్ పిటీషన్
ఖతార్‌లో మరణ శిక్ష పడిన 8 మంది భారత మాజీ నేవీ కుటుంబ సభ్యులకు వారి స్నేహితులతోపాటు దేశంలోని అన్ని వర్గాల ప్రజలు అండగా నిలుస్తున్నారు. ఖతార్ జైల్లో ఉన్న 8 మంది భారత మాజీ నేవీ అధికారులకు న్యాయం జరిగేలా చూడటం కోసం, వారి హక్కులను గౌరవించడం కోసం ఓ ఆన్‌లైన్ పిటీషన్‌ను రూపొందించారు. ఈ పిటీషన్ పట్ల సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే దాదాపు 90 వేల మంది ఈ ఆన్‌లైన్ పిటీషన్‌పై సంతకాలు చేశారు. తమ వారిని తక్షణమే విడుదల చేయాలని ఖతార్‌కు భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేయడానికి, ఈ దిశగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడానికి.. ప్రజలు మద్దతు తెలుపుతున్న ఈ పిటీషన్ తమకు సాయం చేస్తుందని వారి కుటుంబ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఖతార్‌తో భారత్ సంబంధాలు ఎలా ఉన్నాయి?
1971లో ఖతార్ స్వాతంత్య్రం పొందిన తొలి నాళ్లలో.. ఆ దేశాన్ని గుర్తించిన అతి కొద్ది దేశాల్లో భారత్ ఒకటి. 1973 నుంచి ఇరు దేశాల మధ్య పూర్తి స్థాయిలో ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయి. ఇరు దేశాల మధ్య రక్షణ సహకార ఒప్పందం కూడా ఉంది. 2015లో ఖతార్ ఎమిర్ ఆఫ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ భారత్‌లో పర్యటించారు. మరుసటి ఏడాదే ప్రధాని మోదీ ఖతార్‌ను సందర్శించారు. ఖతార్ నుంచి భారత్ పెద్ద ఎత్తున సహజ వాయువును దిగుమతి చేసుకుంటోంది. ఆ దేశంలో 8 లక్షల మంది భారతీయులు నివాసం ఉంటూ ఉపాధి పొందుతున్నారు.