స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణలో ఇద్దరు బీజేపీ నేతలకు కేంద్రం భద్రతను పెంచింది. హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌లకు ఇకపై కేంద్ర బలగాలు భద్రత కల్పించనున్నాయి. ఈటల రాజేందర్‌కు ‘వై ప్లస్’, అర్వింద్‌కు ‘వై’ కేటగిరీ భద్రతను కేంద్రం కేటాయించింది. వీరిద్దరికీ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో భద్రత కల్పించింది. ఈటలకు 11 మందితో కూడిన సీఆర్పీఎఫ్ సిబ్బంది సెక్యూరిటీ కల్పించనున్నారు. ఇక అర్వింద్‌కు 8 మందితో కూడిన సీఆర్పీఎఫ్ బలగాలు రక్షణ కల్పించనున్నాయి. కాగా ఇప్పటికే ఈటల రాజేందర్‌కు తెలంగాణ సర్కార్ ‘వై ప్లస్’ భద్రత కల్పించిన విషయం తెలిసిందే. ఈటల ప్రాణాలకు ముప్పు ఉందని, ఆయన హత్యకు ప్లాన్ జరుగుతోందన్న ప్రచారంతో బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ సహా 16 మందితో సెక్యూరిటీని ఏర్పాటు చేసింది.
అర్వింద్‌కు ఒక కమాండోతో సహా 8 మందిని, ఈటలకు ఇద్దరు కామండోలతో సహా 11 మంది భద్రతా సిబ్బందిని కేటాయించనున్నారు. ఇప్పటికే కేంద్ర హోంశాఖ ఆదేశాలతో సీఆర్‌పీఎఫ్, ఐజీ బృందంతో పాటు ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, రాష్ట్ర ఎస్‌బీ అధికారులు ఈటల, అర్వింద్ ఇళ్లను తనిఖీ చేశారు. అనంతరం వారితో సమావేశమై భద్రత గురించి అడిగి తెలుసుకున్నారు. అధికారుల బృందం రిపోర్ట్ తర్వాత కేంద్రం హోంశాఖ తుది ఉత్తర్వులు జారీ చేయనుంది.
కేంద్ర భద్రతపై అర్వింద్ స్పందించారు. తనకు రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని, అందుకే కేంద్ర ప్రభుత్వాన్ని సెక్యూరిటీ కోరానన్నారు. తన ఇంటిపై గతంలో బీఆర్ఎస్ నేతలు దాడి చేశారని, అందుకే కేంద్రం తనకు అదనపు సెక్యూరిటీ ఇవ్వనుందని తెలిపారు. అటు ఈటలకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు భద్రత కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. కానీ ఇక నుంచి ఆయనకు కేంద్ర బలగాలు సెక్యూరిటీ ఇవ్వనున్నాయి. తనను హత్య చేయించేందుకు హుజూరాబాద్ బీఆర్ఎస్ ఇంచార్జ్, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నట్లు ఇటీవల ఈటల చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. అంతేకాకుండా తన భర్త హత్యకు కౌశిక్ రెడ్డి కుట్రలు పన్నుతున్నారని, ఇందుకోసం కొంతమందికి రూ.40 కోట్ల సుపారీ ఇచ్చినట్లు ఈటల భార్య జమున కూడా ఆరోపించారు.