స్వతంత్ర, వెబ్ డెస్క్: కేంద్ర ఆర్థికశాఖమంత్రి నిర్మలాసీతారామన్ కుమార్తె వాంగ్మయి వివాహన్నీ ఎంతో నిరాడంబరంగా నిర్వహించి ప్రత్యేకంగా నిలిచారు. ఎలాంటి హడావిడి లేకుండా అతి తక్కువ మంది కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు మధ్య వాంగ్మయి వివాహం ప్రతీక్‌తో జరిగింది. ఈ వేడుకను పెద్ద పెద్ద భారీ సెట్టింగ్‌ల మధ్య కాకుండా నిర్మలా సీతారామన్ ఇంట్లోనే పెళ్లి వేడుక పూర్తి చేశారు. ఉడిపిలోని అదమరు మఠ్‌కు చెందిన పురోహితులు బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం వివాహ క్రతువు నిర్వహించారు. వధువు గులాబీ రంగు చీర, ఆకుపచ్చ రవిక ధరించగా.. వరుడు ప్రతీక్ తెలుపు వర్ణం దుస్తుల్లో కనిపించారు. ఈ వివాహానికి సంబంధించిన సమాచారాన్ని కూడా సీతారామన్ కుటుంబ సభ్యులు అధికారికంగా బయటకి వెల్లడించలేదు. అయితే, పెళ్లి సమయంలో తీసిన చిత్రాలు మాత్రం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ వేడుకకి రాజకీయ ప్రముఖులు ఎవరు హాజరు కాలేదు. ఉడుపి మఠానికి చెందిన పలువురు స్వామీజీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకున్న వాఙ్మయి ఒక ప్రముఖ పత్రికలో సీనియర్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు.