కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన NDA ప్రభుత్వం. ఇవాళ కేబినెట్ సమావేశం ఏర్పాటు చెయ్యబోతోంది. నరేంద్ర మోదీ సారధ్యంలో ముచ్చటగా మూడోసారి మోదీ 3.ఓ ప్రభుత్వం కొలువుదీరింది. ఇవాళ జరిగే కేబినెట్ సమావేశంలో ప్రధానంగా 100 రోజుల కార్యాచరణపై చర్చిస్తారని తెలుస్తోంది. ఈ సమావేశం ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో జరగనుంది. మూడోసారి ప్రధానిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత తొలి మంత్రివర్గ సమావేశం ఇదే.
ఇండియాకి పెట్టుబడుల ఆకర్షణ, రైల్వే రంగంలో విప్లవాత్మక మార్పులు, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్, పేదలకు సంక్షేమ పథకాలు, ఇలా చాలా అంశాలపై కేబినెట్‌లో చర్చిస్తారని తెలుస్తోంది. ప్రధానంగా 100 రోజుల్లో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకొని, అమలు చెయ్యాలని మోదీ సంకల్పించారు. ఐతే బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించి ఉంటే కఠిన మైన నిర్ణయాలు తీసుకునేందుకు వీలయ్యేది. కానీ బీజేపీ 240 సీట్లే సాధించింది కాబట్టి ఈ సంకీర్ణ ప్రభుత్వంలో వివాదాస్పద నిర్ణయాలపై మొండిగా ముందడుగు వేసే పరిస్థితి లేదు. ముఖ్యంగా టీడీపీ, జేడీయూ లాంటి పార్టీలు ఏవైనా నిర్ణయాలపై అభ్యంతరాలు చెబితే, మోదీ సర్కార్ వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి రావచ్చు. అందువల్ల ఈ ఐదేళ్ల పాలనలో కఠిన నిర్ణయాలు ఉండకపోవచ్చనే చర్చ జరుగుతోంది. ఇదివరకు ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు వంటి వాటిని మోదీ తమ ట్రాక్ రికార్డుగా చెప్పుకున్నారు. అలాగే ఈసారి యూనిఫామ్ సివిల్ కోడ్ ని అమల్లోకి తేవాలను కుంటున్నారు. ఇప్పటికే ఇది గోవా, ఉత్తరాఖండ్‌లో అమల్లో ఉంది. ఇక వన్ నేషన్, వన్ ఎలక్షన్ అనేది బీజేపీ మరో లక్ష్యం. ఐతే మొదటి 100 రోజుల్లో దీనిపై పెద్దగా చర్యలేవీ ఉండవని తెలుస్తోంది.


