భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు..జరిగిపోయింది…జరగబోతోంది..జరుగుతోంది.. ఈ కాలాల మధ్యలోనే విషయమైనా, అంశమైనా, ఏదైనా ఉండి తీరాల్సింది. ఇప్పుడు..బడ్జెట్. ఎదురుచూపులు.. రాక.. పోక అన్నీ జరిగిపోయాయి. రాబోయే ఏడాది కాలానికి ముందుగా అంచనా వేసిన ప్రణాళికే బడ్జెట్. 2025-26 సెంట్రల్ బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ గుడ్డా, బేడ్డా….అని ప్రజలను అడిగితే…ఎవరి అభిప్రాయం వారు చెబుతారు. అయితే, ఇప్పుడు చాలావరకు గుడ్, బెటర్, బెస్ట్ అనే చెప్పేస్తున్నారు. ఎందుకంటే.. బడ్జెట్ అనగానే వడ్డింపులు, వాయింపులూ అనే చాలామంది నిర్ణయానికి వచ్చేశారు. అనుకున్నామని జరగవు అన్ని… అనుకోలేదని ఆగవు కొన్ని.. జరిగేవన్ని మంచికనే.. అనుకోవడమే మనిషి పని… అని సినీ కవి అన్నారు. ఏం అనుకున్నామో, ఏం అనుకోలేదో.. కాని ఈ బడ్జెట్ లో జరిగింది మాత్రం ఖచ్చితంగా మంచే అని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. ఇందుకు సహేతుకత కన్పిస్తోంది.
కమలం సర్కారు నిర్మలమ్మ కొన్ని బడ్జెట్లలో.. ఆ బడ్జెట్ మంచిగా ఉందో, చెడ్డగా ఉందో అర్థంకాని పరిస్థితిలో ఉండేది. మోదీ హయాంలోని ఎన్డీఏ సర్కారు తొలిసారి ప్రవేశ పెట్టిన బడ్జెట్ వెరీ వెరీ గుడ్ అనిపించుకుంది. అనంతర కాలంలో… గడ్డ పెరుగు మజ్జిగైన తంతులా…కొన్ని బడ్జెట్లు వన్నెతగ్గి, కొన్ని పేలవంగా ఉన్నాయి. ఎన్డీఏ, బీజేపీ సర్కారు రాక మునుపు చాలాకాలంగా ఇన్ కం ట్యాక్స్ 1,80,000 గానే ఉందని అప్పటి పెద్దలు చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో సింగిల్ మ్యాన్ ఆర్మీలా.. మోదీ దూసుకొచ్చి.. బీజేపీని ఆకాశస్థాయికి చేర్చి, ఎన్డీఏ పక్షాలతో కలిపి కేంద్ర సర్కారు ఏర్పాటు చేశారు. అయితే, మాట తప్పడం, మడమ తిప్పడం అలవాట్లు లేకపోవడంతో… ఎన్డీఏ పక్షాలు అవసరం లేకుండా సింగిల్ గా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ సంపాదించినా, సమష్టిగా కేంద్ర సర్కారు ఏర్పాటు చేసి.. కమలం పార్టీ శభాష్ అనిపించుకుంది.
మోదీ నేతృత్వంలో నాడు అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ సర్కారు.. తమ బడ్జెట్ లో ఇన్ కం ట్యాక్స్ 2,50,000 రూపాయల వరకు మినహాయింపు ఇచ్చి ప్రశంసలు పొందింది. ఇదేకాక అసంఘటిత రంగ పిఎఫ్ పింఛన్ దారులకు…అంతకు ముందు అతితక్కువ వచ్చే పింఛన్ ను మినిమమ్ వెయ్యి రూపాయలు చేసి.. థాంక్యూ…ఎన్టీఏ సర్కారు అనిపించుకుంది. కారణాలు ఏమైనా.. అనంతర బడ్జెట్లలో కొందరి ప్రశంసలు, కొందరి అభిశంసలు, మిశ్రమ స్పందనలను ఎన్డీఎ సర్కారు చవిచూసింది. ఇప్పుడు..ఈ బడ్జెట్ ఓవర్ ఆల్ గా చూస్తుంటే.. చాలావరకు మెరుగ్గానే అనిపిస్తోంది. అయితే, కొన్ని తేడాపాడాలు, కొన్ని రాష్ట్రాలకు వరాలు, కొన్నింటిపై చూపు పడకపోవడం, ఆయా రాష్ట్రాల అలకలు, కినుకలు చూస్తున్నాం.
ఈ బడ్జెట్ ఎందుకు ప్రశంసలకు గురవుతోందంటే.. ప్రధానంగా వేతన జీవుల కళ్లల్లో వెలుగులు నింపినందుకు అని స్పష్టంగా తెలుస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 12 లక్షల రూపాయల వార్షికాదాయం పొందేవారికి ఇన్ కమ్ ట్యాక్స్ నరక బాధలు లేవని చెప్పడంతో…మధ్యతరగతి మందహాసం వెల్లివిరుస్తోంది. మధ్యతరగతి అనగానే ఎవరికైనా చాలావరకు చిన్నచూపే ఉంటుంది. పైకి ఎగరా లేరు, కిందకు దిగా లేరు… ఎప్పుడు త్రిశంకు స్వర్గ బతుకే. మిడిల్ క్లాస్ అంటే ఇండివిడ్యుయల్ ఓటింగ్ తప్ప… ఓట్ బ్యాంక్ లు, గుత్తగంప ఓట్లు అనే మాటలు ఉండవు. ఇంక ఈ వర్గాలతో ఎవరికి పని ఉంటుంది. అధికాదాయం పొందే వారు, ఆర్థిక పరిపుష్టి ఉన్న ధనవంతులకు బడ్జెట్లు, ఇన్ ఫ్లేషన్లు, బాధలు, కష్టాలు గొడవలేం ఉండవు. ఇక పేదవర్గాలకు పథకాలు, ప్రయోజనాలు, సంక్షేమ కార్యక్రమాల గురించి ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ నేత అయినా ఎన్నికల ముందు ఊదరగొట్టేస్తారు. చాలావరకు కోతలైనా, ఇచ్చిన హామీల్లో కొన్నింటికి కోతలు పెట్టినా.. అసలు పథకాల అమలు మాత్రం చేస్తారు.
రేషన్ కార్డులు, ఇళ్లపట్టాలు, ఇళ్లు, ఆరోగ్య పథకాలు, ఆర్థిక సాయాలు, పింఛన్లు.. ఇలా ఏవో కొన్ని సౌకర్యాలు కల్గిస్తారు. మరి మధ్యతరగతి.. అంటే అధోగతే అనే మాట వినిపిస్తుంది. మధ్య తరగతివారికి ఇదివరలో ఉండే పచ్చ రేషన్ కార్డులను చాలాకాలం క్రితమే తీసిపారేశారు. గ్రామీణ ప్రాంతాల్లో, చిన్న పట్టణాల్లో ఉండే మధ్యతరగతి వారు దుర్భర జీవితం గడుపూతూ..సాపాటుకు సైతం నోచుకోక, ఉండడానికి గూడు లేక.. చావలేక బతుకుతూ జీవచ్ఛవాల్లా రోజులు గడుపుతున్నా పట్టించుకునే వారు ఎవరు ఉండరు. ఇక పెద్ద పెద్ద పట్టణాల్లో, మహా నగరాల్లో చిన్న చిన్న ఉద్యోగాలో, చిరు వ్యాపారాలో చేసుకు బతికేవాళ్ల పరిస్థితి మరీ అధ్వాన్నం.
చాలిచాలని జీతాలతో…అద్దెఇళ్లల్లో మగ్గుతూ, మైళ్లకు మైళ్లు సిటీ బస్సుల్లో ప్రయాణాలు చేసి.. ఎప్పుడో ఏ అర్థరాత్రికో ఇళ్లకు చేరి.. నానా అగచాట్లు పడుతుంటే.. వీళ్ల గురించి పట్టించుకునే వారు ఎవ్వరు ఉండడం లేదు. సర్కారు పెట్టిన సీలింగ్ తో … ఏ ముప్పయ్యో, నలభై వేలో జీతం ఉంటే… వాళ్లు ఏ పథకానికి అర్హులు కారు. ఇళ్ల పట్టాలు, ఇళ్లకు అర్హత ఉండదు. రోగాలు వస్తే ఆరోగ్య పథకాలు ఉండవు. విద్యాలయాలు, వైద్యాలయాలు అన్ని.. కార్పొరేట్.. కార్పొరేట్…మయం అవ్వడంతో… కష్టార్జితాన్నంతా వాళ్లకు సమర్పించాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో.. వేతన జీవికి ఊరట ఇస్తూ ఈ బడ్జెట్ లో.. కొత్త పన్ను విధానంలో 12 లక్షల రూపాయల వరకు ఆదాయపు పన్ను సున్నా చేయడంతో…పేద, మధ్యతరగతి వర్గాలు ఎగిరి గంతేస్తున్నాయి. కొత్త పన్ను విధానంలో ఈ వెసులబాటు కల్పించడంతో 80 వేల రూపాయల వరకు మిగిలే అవకాశం ఉంటుందని అంటున్నారు. పన్ను మినహాయింపుతోపాటు అద్దెలపై టీడీఎస్ 2.4 లక్షల నుంచి ఆరు లక్షలకు పెంచే నిర్ణయం తీసుకున్నారు.
వృద్ధులకు వడ్డీపై టీడీఎస్ ఊరటనిచ్చింది. ఆరోగ్యమే మహాభాగ్యం… అనారోగ్యం పాలైనప్పుడు ఆ మహాభాగ్యం పొందాలంటే జేబులు ఖాళీ చేసుకుంటే కాని అదిసాధ్యం కావడం లేదు. క్యాన్సర్, దీర్ఘవ్యాధులు నయం చేసే 36 రకాల ఔషధాలను బేసిక్ కస్టమ్స్ డ్యూటీ నుంచి పూర్తిగా మినహాయించడంతో…మందుల ధరలు దిగిరానున్నాయి. గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా, కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి అయిదు లక్షలకు పెంపు తదితర మంచి నిర్ణయాలు తీసుకున్నారు. దేశీయ టెక్స్ టైల్స్ ఉత్పత్తులు ప్రోత్సహించేందుకు అల్లికల దుస్తులపై కస్టమ్స్ సుంకం పది నుంచి 20 శాతం పెంచారు.
వృద్ధి రేటు తగ్గడం, ప్రజలు సైతం ఖర్చులు తగ్గించుకోవడం, కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు వంటి అంశాల వల్ల ఈ నిర్ణయాలు తీసుకుని ఉండవచ్చని వ్యాఖ్యానాలు వినబడుతున్నాయి. ఏ కారణాలైతేనే.. మంచి చేశారా లేదా, మంచి జరిగిందా లేదా అని ఆలోచించాలి. తమ పాలనలో ఉన్న రాష్ట్రాలకే పెద్దపీట వేయాలనే పద్దతిలో కాకుండా, స్నేహబంధాలు, మిత్రబంధాలు గౌరవించాలనే రీతిలో… కూటమి ప్రభుత్వం ఉన్న ఏపీకి ఎన్నో ప్రయోజనాలు కల్పించారు. రాష్ట్ర విభజన అనంతరం చాలాకాలం రాజధానే లేకుండా, ఆర్థిక కష్టాల కడలిలో తేలియడుతూ..ఎన్నో తిప్పలు పడుతున్నా ఏపీపై వరాల జల్లు కురిపించారు.
జల్ జీవన్ మిషన్ కింద చేపట్టే పనుల గడువు ముగుస్తోంది. ఈ గడువు పొడిగించాలన్న ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు మాట గౌరవించి 2028 వరకు జల్ జీవన్ మిషన్ పనులు పొడిగించారు. దీనివల్ల ప్రతి ఇంటికీ కుళాయిద్వారా తాగునీరు వస్తుందని ఏపీ నేతలు చెబుతున్నారు. ఎంఎస్ఎంఈలకు బడ్జెట్ లో ప్రాధాన్యం ఇచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ తో పాటు, విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ పోర్టుకు నిధులు మంజూరు చేశారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్…అంటూ గురజాడవారి వాక్కులు గుర్తుచేస్తూ నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగం ప్రారంభించడంపై తెలుగు ప్రజలు ఉబ్బితబ్బిబవుతున్నారు.
ఆర్ధిక వ్యవస్థను స్థిరంగా ఉంచి, వ్యవసాయం, ఉత్పత్తి, సేవా రంగాలను బ్యాలెన్స్ చేసే బడ్జెట్ ఇది అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఉద్యోగులకు పన్ను మినహాయింపు విప్లవాత్మక చర్య అని, పేద, మధ్యతరగతి, రైతులు, చిరు వ్యాపారుల, యువ పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన బడ్జెట్ అని పలు వ్యాఖ్యానాలు వినబడుతున్నాయి. 7.7 కోట్ల మంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుల పేరిట రుణాలివ్వడమే లక్ష్యంగా పెట్టుకోవడం గొప్ప విషయమని తెలంగాణ బీజేపీ నేతలు అంటున్నారు. తెలంగాణలోని దాదాపు 50 లక్షల మంది రైతులకు అయిదు లక్షల రూపాయల వరకు బ్యాంకుల ద్వారా రుణం లభించే అవకాశముందని చెబుతున్నారు. ప్రైవేట్ వ్యాపారస్తుల, దళారుల వద్ద చేయిచాపే దుస్థితి లేకుండా చేసేందుకు కిసాన్ క్రెడిట్ కార్డులను ప్రవేశపెట్టారని, వెంటనే తెలంగాణలోని రైతన్నలంతా ఈ కిసాన్ క్రెడిట్ కార్డుల మంజూరు కోసం దరఖాస్తు చేసుకుని లబ్ది పొందాలని కమలం పార్టీ పెద్దలు చెబుతున్నారు. ప్రత్యేకించి వేతన జీవుల ఊరట, మందుల ధరల తగ్గుదలపై పేద మధ్యతరగతి వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రానికి అభినందనలు తెలియజేస్తున్నారు.
దేశ, కాల పరిస్థితులను బట్టి సత్వ, రజో, తామస గుణాలు ఉంటాయని పెద్దలు చెబుతారు. సత్వ గుణం ఉత్తమ రీతి ఆలోచనలు, రజో గుణం మధ్యరీతి ఆలోచనలు, తమో గుణం వల్ల అధమ ఆలోచనలు వస్తాయంటారు. ఇప్పుడు కేంద్ర పాలకులు సత్వగుణ సంపన్నతతో మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారేమో అని అనిపిస్తోందని పండితోత్తములు అంటున్నారు. ఈ సత్వ గుణ వైభవం ఇప్పుడు అంతటా ఉందేమో అంటున్నారు. కొన్ని నెలల క్రితం అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడు డొనాలడ్ ట్రంప్ … ఆ దేశంలో ఆదాయపు పన్ను రద్దు దిశగా అడుగులు వేస్తున్నట్టు చెప్పారు. ప్రజలు స్వేచ్ఛగా ఖర్చు చేసుకు నేందుకు వీలుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. స్వేచ్ఛా ఖర్చులతో అమెరికా ఆర్థిక వ్యవస్థలోకి నిధుల ప్రవాహాన్ని పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు చెప్పారు. ప్రజలను ధనవంతులను చేసేందుకు ఈ చర్య ఉపయోగపడుతుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
ఏ సర్కారు ఆలోచనలైనా ప్రజా ప్రయోజనాల కోసమే ఉంటాయి. పాలకుల నిర్ణయాలు కొన్ని వెంటనే ప్రయోజనకరంగా అనిపించకపోయినా, భవిష్యత్ లో బాగా ఉపయోగపడేవిగా ఉండవచ్చు. ఒకప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని..కాల,మాన పరిస్థితులను బట్టి మార్చుకోవచ్చు. ఆ నిర్ణయాలకు భిన్నంగా మరో నిర్ణయం తీసుకోవచ్చు. అంతా మనమంచికే అని భావించడం ఉత్తమం. జనాభా అపరిమితంగా పెరిగిపోతున్నప్పుడు…ఎన్నో సమస్యలు ఉత్పన్నం అయ్యేవి.. ఆహార సమస్య, ఆరోగ్య సమస్య నిరుద్యోగ సమస్య…ఇలా ఎన్నో తలెత్తడంతో ఆయా పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు ఉండేవి. ఇదివరలో కుటుంబ నియంత్రణకు పెద్ద పీట వేసి…ఆ దిశగా ప్రభుత్వాలు అడుగులు వేశాయి. ఇప్పుడు జనాభా సమస్య… జనరహిత స్థితికి చేరేలా వృత్తులు, ఒత్తిడిలు, కొలువులు ఉండడంతో.. అధిక సంతానం ఉండాలనే దిశగా అందరి ఆలోచనలు వెళుతున్నాయి. భూమి గుండ్రంగా ఉన్నట్టు .. ఏదైనా.. ఈ రీతిన సాగుతాయేమో.. దుస్తులు, ఫ్యాషన్లు చూసినా… పూర్వపు పద్దతులే పలు ఆధునిక మార్పులతో వస్తున్నాయి. ఉదాహరణకు పురుషుల దుస్తులకు సంబంధించి విషయాన్ని తీసుకుంటే.. మొదట్లో బాగా లూజ్ ఫ్యాంటులు ఉండేవి, తరువాత నేరోకట్, బెల్ బాటం ఫ్యాంటులు వచ్చాయి. అనంతరం పూర్వం నేరోకట్, లూజ్ ఫ్యాంటులు వచ్చేశాయి. ఇదే రీతిలో మహిళల వస్త్రధారణలోనూ పూర్వ పద్దతులే నూతన రీతిలో వస్తున్నాయి. పాతే కొత్త కొత్త మార్పులతో కొత్తగా వస్తోంది.
ఇక, దేశవ్యాప్తంగా ఉన్న చిరుద్యోగ, కార్మిక పిఎఫ్ పింఛన్ దార్ల.. అతి తక్కువగా ఉన్న తమ పింఛన్ మొత్తం వెయ్యిరూపాయల నుంచి కొంతేనా పెంచుతారేమో అని ఎదురుచూపులు చూసినా…అది మాత్రం నెరవేరలే ఏదైనా ఈ ఏడాది దేశ ప్రి ఎస్టిమేటెడ్ ప్లాన్ లో కేంద్ర సర్కారు మంచి మార్కులే కొట్టేసినట్టు విదితం అవుతోంది.
—————-