తెలంగాణలోని తాగునీటి వ్యవస్థ స్థిరీకరణ కోసం అవసరమైన నిధులు మంజూరు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ తాగునీటి అవసరాలు తీర్చేందుకు నీతి ఆయోగ్ గతంలో సిఫార్సు చేసిన విధంగా కనీసం రూ.16 వేల కోట్లను మంజూరు చేయాలని కోరారు. ప్రతి ఏటా తాగు నీటి అవసరాల కోసం తెలంగాణ ప్రభుత్వం సుమారు రూ. 5 వేల కోట్లను వెచ్చిస్తుందని గుర్తు చేశారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆద్వర్యంలో రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ లో రెండు రోజుల పాటు జరుగుతున్న అన్ని రాష్ట్రాల తాగు, సాగునీటి పారుదల శాఖ మంత్రుల రెండో సదస్సులో మంత్రి సీతక్క పాల్గొని ప్రసంగించారు. కేంద్ర జల శక్తి శాఖమంత్రి సీఆర్ పాటిల్, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్రాల మంత్రులు పాల్గోన్న సదస్సులో, తెలంగాణ అమలవుతున్న మిషన్ భగీరథ, ఇతర తాగు నీటి పథకాలను వివరించడంతో పాటు రాష్ట్ర అవసరాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు.
దేశ స్వాతంత్రం నుంచి నేటి వరకు దేశంలో, తెలంగాణ ప్రాంతంలో తాగు నీటి సరఫరా కోసం ఆయా ప్రభుత్వాలు చేపట్టిన చర్యలను మంత్రి సీతక్క ప్రస్తావించారు. మారిన జీవన పరిస్థితులు, ప్రజల అవసరాల నేపథ్యంలో ఊరుమ్మడి బావి నుంచి ఇంటింటికి నల్లా ఏర్పాటు వరకు సాధించిన పురోగతిని వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేయి కోట్ల ఖర్చుతో చేపట్టిన మిషన్ భగీరథ పనుల వివరాలను ప్రస్తావించారు. నీరు కేవలం ఒక వనరు మాత్రమే కాదని..అది మానవాళి మనుగడకు జీవనాధారమని చెప్పారు. స్వచ్ఛమైన, సురక్షితమైన తాగు నీటిని పొందడం ప్రజల ప్రాథమిక రాజ్యాంగ హక్కు అని, ఆ హక్కుని కాపాడాల్సిన భాద్యత ప్రభుత్వాలదే అన్నారు. వేగంగా మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న అవసరాల నేపథ్యంలో తాగు నీటి కొరతను తీర్చేందుకు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
గ్రామీణ తాగు నీటి సరఫరాను పెంపొందించడంలో పంచవర్ష ప్రణాళికలు ఎంతో దోహద పడ్డాయని మంత్రి సీతక్క గుర్తు చేశారు. కేంద్రంలో గత ప్రభుత్వాలు ముందు చూపుతో వ్యవహరించడం వల్ల 1980 నాటికే.. 83 శాతం గ్రామీణ ప్రాంతాలకు కనీసం ఒక తాగునీటి వనరు అందుబాటులో కి వచ్చిందని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ నేషనల్ డ్రింకింగ్ వాటర్ మిషన్, నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రాం వంటి కార్యక్రమాలుసురక్షితమైన మంచినీటిని అందించడానికి కృషి చేసాయని తెలిపారు. దానికి కొనసాగింపుగా కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటి నల్లా నీల్లిచ్చే పథకాన్ని అమలు పరుస్తోందన్నారు మంత్రి సీతక్క.