వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ బిల్లుపై కేబినెట్‌లో చర్చించి ఆమోదం తెలిపారు. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఈ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టేందకు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీకి నివేదించే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే జమిలి ఎన్నికలపై ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తుండడంతో..ఏకాభిప్రాయం సాధించేందుకు ఎన్డీయే ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ బిల్లు ఆమోదం పొందాలంటే రాజ్యంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం పార్లమెంట్‌లో మూడింట రెండు వంతుల మెజార్టీతో బిల్లు పాస్ అవ్వాల్సి ఉంటుంది. 245 సీట్లు ఉన్న రాజ్యసభలో ఎన్టీఏకి 112 సీట్లు ఉన్నాయి. ప్రతిపక్షానికి 85 సీట్లు ఉన్నాయి. అయితే మూడింట రెండు వంతుల మెజార్టీ సాధించడానికి ప్రభుత్వానికి కనీసం 164 సీట్లు అవసరం అవుతాయి.
అలాగే లోక్ సభలోని 545 సీట్లలో 292 స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్ధులు ఉన్నారు. మూడింట రెండు వంతుల మెజార్టీ అంటే 364 సభ్యుల మద్దతు అవసరం. ఈ కారణంగా బిల్లు ఆమోదం పొందడం కష్టసాధ్యమే అవుతుంది. దీంతో విస్తృత సంప్రదింపులకు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి బిల్లును సిఫార్సు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.