దేశ వ్యాప్తంగా వరద ప్రభావిత ప్రాంతాలకు కేంద్ర హోం శాఖ 5 వేల 858 కోట్ల రూపాయలు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ వాటాలో భాగంగా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అడ్వాన్స్ నుంచి 14 రాష్ట్రాలకు హోంశాఖ నిధులు మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందాలు, నష్టాన్ని అంచనా వేస్తూ ఇచ్చిన నివేదిక మేరకు తక్షణ సాయంగా ఈ నిధులను కేటాయించింది. కేంద్ర బృందాల నుంచి పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని నిధులు మంజూరు చేయనున్నట్లు హోంశాఖ తెలిపింది.
వరదలతో తీవ్రంగా నష్టపోయిన ఏపీని ఆదుకునేందుకు 1,036 కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర విపత్తు నిధికి NDRF నుంచి కేంద్ర వాటా నిధులను విడుదల చేసింది. తెలంగాణకు 416 కోట్లకు పైగా నిధులు విడుదల చేసిన కేంద్ర హోంశాఖ, అత్యధికంగా మహారాష్ట్రకు 14 వందల 32 కోట్లు ఇచ్చింది. అస్సాంకి 716 కోట్లు, బిహార్ కి 655 కోట్లు, గుజరాత్ కి 600 కోట్ల రూపాయలు కేటాయించింది. పశ్చిమ బెంగాల్‌కు 468 కోట్ల రూపాయల మంజూరు చేశారు. హిమాచల్ కి 189, కేరళకు145, మణిపుర్‌కు 50 కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించింది.