మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ మరింత దూకుడు పెంచింది. పులివెందుల వెళ్లిన అధికారులు అక్కడ వివేకా ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం సమీపంలోని అవినాశ్ ఇంటికి వెళ్లి పరిసరాలను తనిఖీ చేశారు. అక్కడే ఉన్న అవినాశ్ పీఏ రమణారెడ్డితో కాసేపు మాట్లాడారు. తిరిగి వివేకా ఇంటికి వచ్చిన అధికారులు అక్కడ పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ ఇనయతుల్లాను ప్రశ్నించారు. హత్య జరిగిన రోజు ఇంట్లో ఎవరెవరు ఉన్నారనే దానిపై ఆరా తీశారు. ఇనయతుల్లానే మొదట వివేకా మృతదేహం ఫోటోలు, వీడియోలు తీసి కుటుంబ సభ్యులకు పంపించారు.
హత్య జరిగిన విషయం తెలుసుకున్న అవినాశ్ రెడ్డి తన ఇంటి నుంచి వివేకా ఇంటికి ఎంత సమయంలో రావొచ్చనే అంశాన్ని అధికారులు పరిశీలించారు. సోమవారం సుప్రీంకోర్టులో అవినాశ్ రెడ్డి బెయిల్ విచారణ నేపథ్యంలో సీబీఐ బృందాలు వివేకా, అవినాశ్ ఇళ్లను తనిఖీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా శనివారం సాయంత్ర వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డిని సీబీఐ విచారించిన సంగతి తెలిసిందే.