పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారంటూ తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మహువా మొయిత్రాపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే దర్యాప్తు అధికారులు సోదాలు చేపట్టారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని మహువా నివాసంతో పాటు ఇతర నగరాల్లో ఆమెకు చెందిన కార్యాలయాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. ఈ కేసులో బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే ఫిర్యాదుతో మహువాపై దర్యాప్తు చేపట్టాలని సీబీఐని లోక్‌పాల్ ఆదేశించింది. ఆరు వారాల్లోగా నివేదిక సమర్పించాలని సూచించింది. దీంతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ సోదాలు చేపట్టింది.
అదానీ గ్రూప్‌ను, ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకునేలా ప్రశ్నలు అడిగేందుకు ప్రముఖ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి మహువా 2 కోట్లతోపాటు ఖరీదైన బహుమతులు తీసుకున్నారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన లోక్‌సభ నైతిక విలువల కమిటీ.. ఆమె అనైతిక ప్రవర్తనకు పాల్పడ్డారని తేల్చింది. ఈ నివేదిక ఆధారంగా గతేడాది డిసెంబరులో స్పీకర్ బహిష్కరణ వేటు వేయడంతో లోక్‌సభ సభ్యత్వం రద్దయ్యింది. దీన్ని మహువా తీవ్రంగా ఖండించారు. బహిష్కరణ వేటుపై సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇదే వ్యవహారానికి సంబంధించిన విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం నిబంధనల ఉల్లంఘన కేసులో ఈడీ ఆమెకు సమన్లు జారీ చేసింది.


