మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లారు. దస్తగిరికి ఉన్న భద్రతపై ఆరా తీశారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని దస్తగిరికి అధికారులు సూచించారు. ఏదైనా సమస్య ఉంటే తమకు చెప్పాలని.. ఎవరైనా అనుమానాస్పదంగా కనపడినా సమాచారం తెలియజేయాలని తెలిపారు.
ఎంపీ అవినాశ్ రెడ్డి పులివెందుల చేరుకోవడంతో సీబీఐ అధికారులు కూడా అక్కడే మకాం వేశారు. దీంతో ఆయనకు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసే అవకాశాలున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అప్రూవర్ దస్తగిరి ఇంటికి వెళ్లి జాగ్రత్తగా ఉండాలని చెప్పినట్లు సమాచారం. కాగా తనకు సీఎం జగన్, ఎంపీ అవినాశ్ నుంచి ప్రాణహాని ఉందని ఇటీవల కడప ఎస్పీకి దస్తగిరి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.