సినీ పరిశ్రమలో పేరున్న దగ్గుబాటి కుటుంబానికి షాక్ తగిలింది. కోర్టు ఆదేశాలు ఉన్నాలీజుకు ఇచ్చిన స్థలంలో నిర్మాణాలు కూల్చివేసినందుకు కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఫిల్మ్ నగర్ లో దగ్గుబాటి ఫ్యామిలీకి ఉన్న స్థలాన్ని నందకుమార్ కు లీజుకు ఇచ్చారు. ఆ స్థలంలో నందకుమార్ దక్కన్ కిచెన్ అనే హోటల్ ను నడుపుతున్నారు. నందకుమార్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడుగా ఉన్నారు. అయితే లీజు విషయంలో వివాదం తలెత్తడంతో నందకుమార్ కోర్టుకు వెళ్లాడు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో దొరికిన అనంతరం 2022 నవంబర్ లో జీహెచ్ ఎంసీ సిబ్బంది హోటల్ ను పాక్షికంగా ద్వంసం చేశారు. తర్వాత సదరు స్థలంలో ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకున్నారు.
అయినా 2024 జనవరిలో హోటల్ ను పూర్తిగా కూల్చివేశారని నందకుమార్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం దక్కన్ హోటల్ కూల్చివేతలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించకుండా ధిక్కరించిన దగ్గుబాటి ఫ్యామిలీపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో హీరో దగ్గుబాటి వెంకటేశ్, నిర్మాత సురేశ్ బాబు, హీరో అభిరామ్ పై శనివారం ఫిల్మ్ నగర్ పోలీసులు 448, 452, 458, 120 బి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
అయితే నందకుమార్ పై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆయన లీజు నిబంధలను ఉల్లంఘించి నిర్మాణాలు చేశారని దగ్గుబాటి కుటుంబం అంటోంది. అంతేకాదు తమ స్థలం విషయంలో దౌర్జన్యం కూడా చేశారని ఈ కుటుంబీకులు అంటున్నారు. కోర్టులో కేసులు వేసి బెదిరించి దక్కన్ కిచెన్ హోటల్ ను నిర్వహించారని, స్థలం లీజుకు ఇచ్చిన దగ్గుబాటి ఫ్యామిలీయే ఇప్పుడు ఇబ్బందులు పడుతోందని ప్రచారం కూడా జరుగుతోంది.