స్వతంత్ర వెబ్ డెస్క్: చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పటికే ఎన్నో సేవలు అందిస్తూ ప్రజలకు చేతనైనంత సాయం చేయడంలో ముందుంటారు మెగాస్టార్. అలాంటిదే ఇప్పుడు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సినీ కార్మికులు, జర్నలిస్టులతోపాటు సాధారణ ప్రజల కోసం ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే స్టార్ హాస్పటల్స్ సారథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లో మెగా క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమం జరిగింది. జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో జరిగిన ఈ క్యాంప్‌లో సినీ పరిశ్రమలోని 24 శాఖలకు చెందిన వారితోపాటు, సినీ జర్నలిస్టులు పాల్గొని క్యాన్సర్‌కు సంబంధించిన పరీక్షలు చేయించుకున్నారు. దాదాపు 2000మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంపై నాగబాబు మాట్లాడుతూ.. ‘‘వైద్య వృత్తిని మేము ఎంతో గౌరవిస్తాం. ఏ రంగంలోనైనా ఒక తప్పు చేస్తే దాన్ని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ, వైద్యరంగంలో అలా ఉండదు. ఎన్ని ఎమోషన్స్ ఉన్నా సరే.. వాటన్నింటినీ పక్కనపెట్టి వైద్యులు సేవలు అందిస్తుంటారు. అందుకే ఆ వృత్తి అంటే నాకంత గౌరవం. చిరంజీవి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇలాంటి విశేష కార్యక్రమం నిర్వహించడం అనేది మాకు నిజంగానే గర్వించే క్షణం. కరీంనగర్‌తో పాటు దాదాపు 15 నగరాల్లో ఈ స్క్రీనింగ్ టెస్టులు త్వరలోనే మొదలు కానున్నాయి. అందరూ ఈ సేవలను వినియోగించాలని కోరుతున్నాను’’ అని అన్నారు.