మూడు నెలలుగా తీహార్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించ నుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అవకతవకలు జరిగాయని సీబీఐ, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఈడీ నమోదు చేసిన కేసులో ప్రస్తుతం కవిత అరెస్ట్ అయ్యారు. కవిత బెయిల్ పిటిషన్‌ను ట్రయల్ కోర్టు కొట్టివేయడంతో ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కవిత తరపున న్యాయవాదుల వాదనలతోపాటు ఈడీ, సీబీఐ వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఇవాళ్టికి రిజర్వు చేసింది. జస్టిస్ స్వర్ణకాంతశర్మ మధ్యాహ్నం తీర్పు వెలువరించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు న్యాయమూర్తి తీర్పు ప్రకటించనున్నారు. సీబీఐ అవినీతి కేసుతో పాటు ఈడీ మనీ లాండరింగ్ కేసులో కవిత బెయిల్ దరఖాస్తులను కొట్టివేస్తూ మే 6న ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఆమె సవాల్ చేశారు. ఈ కేసులోని 50మంది నిందితుల్లో కవిత ఒక్కరే మహిళని, దీన్ని పరిగణనలోకి తీసుకొని బెయిల్ ఇవ్వాలని కవిత తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అయితే ఈ వాదనను సీబీఐ, ఈడీ వ్యతిరే కించాయి. ఈక్రమంలో కవితకు బెయిల్ వస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది.ఢిల్లీ హైకోర్టులో కవిత కు ఉపశమనం దక్కకపోతే ఆమె తరపు న్యాయమవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నా యి. మధ్యాహ్నం తీర్పు ఆధారంగా ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలనేదానిపై కవిత న్యాయవాదుల బృందం ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. కనీసం రెగ్యులర్ బెయిల్ ఇవ్వకపోయినా, కండీ షన్స్ బెయిల్ కోసం ప్రయత్నం చేయాలని కవిత తరపున న్యాయవాదులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.