మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. మళ్లీ ఫామ్ లోకి వస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఓటమి బాధ నుంచి కోలుకుంటున్నారు. ఇటీవల కాంగ్రెస్ పెట్టిన పోల్ లో ఎక్కువ మంది బీఆర్ ఎస్ పార్టీకే జై కొట్టారు. దీంతో కేసీఆర్ లో మళ్లీ ఆనాటి ఉత్సాహం కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది.. ప్రజలు గులాబీ పార్టీనే కోరుకుంటున్నారని అన్నారు. అన్ని సంక్షేమ పథకాలను అటకెక్కించిందని.. రైతు బంధు, రైతు భరోసా ఇవ్వకుండా మోసం చేస్తుందని ఆరోపణలు సైతం చేశారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో తనను కలిసేందుకు వచ్చే నాయకులతో భేటీ అవుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు.
తాజాగా మరోసారి కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. బిఆర్ఎస్ పార్టీలో స్టేషన్ ఘన్ పూర్ నియోజకవవర్గం ధర్మాసాగర్ మాజీ జెడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, పలువురు నేతలు చేరారు. కేసీఆర్ వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఫిరాయింపులపై హాట్ కామెంట్స్ చేశారాయన. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయమని చెప్పారు. స్టేషన్ ఘనపూర్ లోనూ ఉప ఎన్నిక వస్తుందని.. ఉప ఎన్నికల్లో కడియం శ్రీహరి ఓటమి ఖాయమని జ్యోసం చెప్పారు. తాటికొండ రాజయ్య మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుస్తారని కూడా ధీమా వ్యక్తం చేశారు.