తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ఓ బస్సు ప్రమాదానికి గురైంది. తిరుపతి నుంచి భక్తులతో తిరుమలకు వెళుతున్న ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు పిట్టగోడను ఢీకొనడంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం కారణంగా ఘాట్ రోడ్డులో కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. టీటీడీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. ప్రమాదానికి కారణమైన బస్సును క్రేన్ సాయంతో పక్కకు తరలించారు. గాయపడిన భక్తులను రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఆర్టీసీ బస్సు పిట్టగోడను ఢీకొట్టినా క్రాష్ బారియర్ పటిష్టంగా ఉండడంతో పెను ప్రమాదం తప్పినట్టు తెలుస్తోంది. లేదంటే బస్సు లోయలో పడిపోయేది. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకుంటున్నారు.
ఇవాళ ఉదయం కూడా లడ్డూ కౌంటర్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఇలా తిరుమలలో ఒకే రోజు రెండు ఘటనలు ఆందోళన కలిగించేలా ఉన్నాయి.