స్వతంత్ర వెబ్ డెస్క్: ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలలో ఎక్కువగా సెమీకండక్టర్లు వినియోగిస్తున్నారు. ఇప్పటికీ ఇండియా వీటిని దిగుమతి చేసుకుంటోంది. ఈ విభాగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఇండియా ప్రయత్నిస్తోంది. ఈ విషయాన్ని గుజరాత్ పర్యటనలో భాగంగా శుక్రవారం నిర్వహించిన సెమీకాన్ ఇండియా 2023 సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ మరోసారి స్పష్టం చేశారు. ఫాక్స్‌కాన్ ఛైర్మన్ యంగ్ లియుతో సహా పలువురు సెమీకండక్టర్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఈవెంట్‌కు హాజరయ్యారు. వారందరి సమక్షంలో మోదీ మాట్లాడుతూ.. గ్లోబల్ సెమీకండక్టర్ ఇండస్ట్రీ చైయిన్‌లో భారతదేశం ఒక ముఖ్యమైన ప్లేయర్‌గా ఎదగడానికి చురుకుగా కృషి చేస్తోందని తెలిపారు. సెమీకండక్టర్ ఇండస్ట్రీ కోసం భారత్ చేస్తున్న ప్రణాళికలు ఆగిపోయాయని, నత్త నడక సాగుతున్నాయనే మాటలు వినిపిస్తున్న వేళ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
సెమీకండక్టర్ ఇండస్ట్రీ వృద్ధికి మద్దతు ఇవ్వడానికి దేశం పూర్తి ఎకోసిస్టమ్‌ను సృష్టిస్తోందని, పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకుందని కూడా ప్రధాని చెప్పుకొచ్చారు. సెమీకండక్టర్ రంగంలో పెట్టుబడులను కోఆర్డినేట్ చేసి, మేనేజ్ చేయడానికి భారతదేశం గ్రాండ్ కండక్టర్‌గా కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. తద్వారా సెమీ కండక్టర్ ఇండస్ట్రీ వృద్ధికి ఇండియా పూర్తిస్థాయిలో కృషి చేస్తుందని స్పష్టం చేశారు.