పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని దోచుకుందని అన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. తెలంగాణను పాలించిన కేసీఆర్ ఫ్యామిలీ రాష్ట్రాన్ని అవినీతి మయం చేసిందని విమర్శించారు. తెలంగాణను దోచుకున్నది చాలక.. ఢిల్లీ వెళ్లి మరి దోపిడీ చేశారని తెలిపారు. తెలంగాణ సమాజం తలదించుకునేలా కేసీఆర్ కుటుంబం వ్యవహరించిందని ఆయన స్పష్టంచేశారు. లిక్కర్ వ్యాపారంతో అవినీతికి పాల్పడిన చరిత్ర కేసీఆర్ కుటుంబానిదని అన్నారు.
మరో వైపు, కవిత అరెస్టుకు బీజేపీ ఏలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టంచేశారు. బీనామీలతో మద్యం వ్యాపారాలు చేసి తమ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కుటుంబ రాజకీయాలు, అవినీతిపైన బీజేపీ ప్రభుత్వం పోరాటం చేస్తుందని స్పష్టంచేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ప్రగల్బాలు పలికారని.. తీరా అధికారంలోకి వచ్చాక దాని ఊసే లేదని కిషన్ రెడ్డి విమర్శించారు. ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందని తెలిపారు. కాంగ్రెస్ హామీలు ఫ్లెక్సీల వరకే అమలవుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.