రాజధాని అమరావతి నిర్మాణానికి ఎంత ఖర్చవుతుంది..? ఎన్ని రోజుల్లోగా పూర్తవుతుంది? ఏపీ సీఎం చంద్రబాబు అమరావతిలో పర్యటించిన నేపథ్యంలో ఇప్పుడు అందరిలోనూ ఇవే ప్రశ్నలు. అయితే ప్రజా రాజధాని నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో ఇప్పుడే చెప్పడం కష్టమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. గల్లాపెట్టె మొత్తం ఖాళీ అయిందన్న ఆయన ఖజానాలో ఎన్ని డబ్బులున్నాయన్నది తెలీదన్నారు. అయి నా సరే వెనకడగుకు వేసేది లేదన్న చంద్రబాబు. అమరావతిని పునర్నిర్మిస్తామని ప్రకటించారు. ఇప్పటికే మంత్రి నారాయణ అమరావతి నిర్మాణానికి లక్ష కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేసిన నేపథ్యంలో ఆ మేరకు నిధులను సమకూర్చుకోవడం ఎలా అన్నది కూటమి ప్రభుత్వానికి సవాలుగా మారిందన్న మాట విన్పిస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌ను సంక్షిప్తంగా పిలిచే ఏపీ పేరుకు సరికొత్త నిర్వచనం చెప్పారు సీఎం చంద్రబాబు. ఏ అంటే అమరావతి అని, పీ అంటే పోలవరం అని ప్రకటించారు. ఈ రెండు సంపద సృష్టి కేంద్రాలని వీటి కార ణంగా యావత్ సమాజానికి ఎంతో మేలు కలుగుతుందన్నారు ముఖ్యమంత్రి. టీడీపీ కూటమి అధికారం లోకి వచ్చి ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదట పోలవరం వెళ్లగా ఇప్పుడు అమరా వతిలో పర్యటించారు. ప్రజావేదిక ప్రాంతంతో మొదలు పెట్టి సుమారు నాలుగు గంటల పాటు అక్కడ ఉన్న నిర్మాణాలను అన్నింటినీ పరిశీలించారు ఏపీ సీఎం. ఈ సందర్బంగా కొంత భావోద్వేగానికి గురయ్యారు చంద్రబాబు. ప్రజా వేదికను కూల్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించిన ఆయన ఈ ఐదేళ్లపాటు పనులు కొనసాగించి ఉంటే ఇప్పటికి కచ్చితంగా రాజధాని నిర్మాణం ఓ కొలిక్కి వచ్చేద న్నారు. గత వైసీపీ సర్కారుపై విమర్శలు గుప్పించిన ఆయన రాజధాని ప్రాంతంలోని కట్టడాల వద్ద తుమ్మ చెట్లు పేరుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు కాంట్రాక్టర్లు తీసుకొచ్చిన మెటీరియల్, పైపులు, ఇసుక సైతం దోచుకుపోయిన పరిస్థితి ఉందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు.ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్ర గల్లా పెట్టే ఖాళీ అయిందన్న ఆయన అసలు ఖజానాలో ఎంత డబ్బుందో తెలియని పరిస్థితి నెలకొందని చెప్పుకొచ్చారు. అంతేకాదు బడ్జెట్, బడ్జెటేతర అప్పులు చేశారని తెలిపిన సీఎం అన్ని అంశాలనూ ప్రజల ముందుకు తీసుకొస్తామన్నారు. అంతేకాదు. ఓ శ్వేతపత్రంవిడుదల చేసి అనంతరం అందరి సలహాలు, సూచనలు తీసుకొని కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. అయితే ప్రస్తుతం రాజధాని పునరుద్దరణ నిర్మాణ పనులను తుమ్మచెట్ల తొలగింపుతో మొదలు పెడుతున్నట్లు ప్రకటించారు. టెండర్లు పిలిచి పారదర్శకంగా ముందుకు వెళ్లనున్నట్లు చెప్పుకొ చ్చారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు.
ఏపీ అంటే అమరావతి, పోలవరం అని కొత్త అర్థం చెప్పిన చంద్రబాబు. ఆ రెండు ప్రాజెక్టులూ తమకు అత్యంత ప్రాధాన్యతా అంశాలని ప్రకటించారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ వాటి నిర్మాణానికి నిధు లు ఎంత ఖర్చవుతాయి. ఇంకా ఎంత అవసరం అవుతుంది. వాటికి నిధుల సేకరణ సంగతేంటి రుణా లను ఎలా తీసుకువస్తారు అన్నదే అత్యంత కీలకమైన అంశంగా మారింది. ఇప్పటికే గత ప్రభుత్వం ఎన్నో తాకట్టు పెట్టిందని విమర్శించారు టీడీపీ నేతలు. పైగా ఇటీవలె అమరావతి నిర్మాణానికి తాజా రేట్ల ప్రకారం చూస్తే లక్ష కోట్ల వరకు ఖర్చవుతుందని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు. మరి ఇప్పుడు అన్ని నిధులుఎలా తీసుకొస్తారు అన్నది ఆసక్తి రేపుతోంది. అయితే ఎవరేమన్నా ఎలాంటి పరిస్థితులు ఎదురై నా అమరావతి నిర్మాణం ఆగదన్నారు చంద్రబాబు. రాష్ట్రాన్ని పునర్నిర్మించడమే కాకుండా, పూర్వ వైభ వం తీసుకొస్తామని ప్రకటించారు చంద్రబాబు.ఇప్పటికే రాజధాని లేని రాష్ట్రం అంటూ ఇతర రాష్ట్రాల వాళ్లు, ఇతర పార్టీల వాళ్లు ఆంధ్రప్రదేశ్ కేపిటల్ విషయంలో విమర్శలు గుప్పిస్తున్నారు. మరి ఈ అంశంలో టీడీపీ కూటమి ప్రభుత్వం సక్సెసవుతుందా? పనులు శరవేగంగా సాగి ప్రజా రాజధాని అమరా వతి రూపు రేఖలు మారిపోతాయా అన్నది ఆసక్తకికర అంశంగా మారింది.


