కోల్‌కతా డాక్టర్ హత్యాచార కేసులో నిందితుడు సంజయ్‌రాయ్‌కి కోర్టు యావజ్జీవ శిక్ష ఖరారు చేసింది. సీల్దాలోని సీబీఐ స్పెషల్ కోర్టు ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత ఈ మేరకు తీర్పు ఇచ్చింది. అలాగే బాధిత కుటుంబానికి రూ.17 లక్షల పరిహారం చెల్లించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఘటన అరుదైన కేసు కేటగిరిలోకి రాదని వ్యాఖ్యానించింది. అందుకే మరణశిక్ష విధించడం లేదని కోర్టు తెలిపింది. గత ఏడాది ఆగస్ట్ 9న ఆర్జీకర్ ఆస్పత్రిలో వైద్యురాలిపై అత్యాచారం చేసి ఆపై దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో సంజయ్‌రాయ్‌ని కోర్టు దోషిగా తేల్చింది. సోమవారం మధ్యాహ్నం సంజయ్‌రాయ్‌కి జీవితఖైదు విధిస్తూ సీల్దా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
డాక్టర్‌పై హత్యాచార ఘటన గత ఏడాది పెను సంచలనం సృష్టించింది. శిక్ష ఖరారు చేయడానికి ముందు నిందితుడు సంజయ్ రాయ్ జడ్జి ముందు తన వాదనలు వినిపించాడు. తాను ఏ నేరం చేయలేదని కోర్టుకు వెల్లడించాడు.
“నేను ఏ తప్పు చేయలేదు. నన్ను ఇరికించారు. ఈ కేసులో చాలా ఆధారాలు ధ్వంసమయ్యాయి. నేను ఎప్పుడూ రుద్రాక్ష ధరిస్తాను. నేను నేరం చేసి ఉంటే నా రుద్రాక్ష మాల విరిగిపోయేది. నన్ను ఇరికించారో లేదో దానిని బట్టే మీరు నిర్ణయించుకోండి.” అని అన్నాడు
తాను తీర్పు ఇవ్వాలని న్యాయమూర్తి బదులిచ్చారు. “నా ముందున్న సాక్ష్యాధారాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటాను. మూడు గంటల పాటు మీ వాదనలు కూడా విన్నాను. మీ న్యాయవాది మీ కేసు వాదించారు. అభియోగాలు రుజువయ్యాయి. ఇప్పుడు శిక్షపై మీ అభిప్రాయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను” అని జడ్జి అన్నారు.
గతేడాది ఆగస్ట్ 9న రాత్రి ఆర్జీకర్ ఆస్పత్రి సెమినార్ గదిలో ఒంటరిగా నిద్రిస్తున్న జూనియర్ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటన తీవ్ర నిరసనలకు దారి తీసింది. పశ్చిమబెంగాల్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును కోల్‌కతా పోలీసుల నుంచి సీబీఐ స్వీకరించి విచారించింది. ఇందులో భాగంగా ప్రత్యేక కోర్టుకు అభియోగాలు సమర్పించింది. ప్రధాన నిందితుడు సంజయ్‌రాయ్ పేరును మాత్రమే ఛార్జ్‌షీట్‌లో చేర్చింది. సామూహిక అత్యాచారం విషయాన్ని ఛార్జ్‌షీట్‌లో ప్రస్తావించలేదు. ఆస్పత్రి ఆవరణలోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా సంజయ్‌రాయ్‌ను ఆగస్టు 10న కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేశారు.