స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం, అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన దేశంలోనే మొట్టమొదటి ‘బ్రాహ్మణ సదన్’ దేశానికే ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక, ధార్మిక సమాచార కేంద్రంగా నిలవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. హైద్రాబాద్ గోపనపల్లిలో తొమ్మిదెకరాల విస్తీర్ణంలో నిర్మాణం పూర్తిచేసుకుని ఈ నెల 31న ‘తెలంగాణ బ్రాహ్మణ్ సదన్’ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా… తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు, సభ్యులతో సిఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో శనివారం సమీక్ష నిర్వహించారు. సమావేశంలో చండీయాగం, సుదర్శన యాగం నిర్వహణ, ఇతర రాష్ట్రాలనుంచి వచ్చే బ్రాహ్మణ సంఘాల నాయకులు, పీఠాధిపతులు, అర్చకులు, వేదపండితులకు చేయాల్సిన ఏర్పాట్ల గురించి సిఎం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ మాట్లాడుతూ… అర్చక పౌరహిత్యమే జీవనాధారంగా చేసుకుని, నిత్యం భగవత్ సేవలో నిమగ్నమౌతూ, సమస్త లోక క్షేమాన్ని కాంక్షిస్తూ తమ జీవితాలను ధారపోసే బ్రాహ్మణ సమాజాన్ని కాపాడుకోవాల్సిన భాధ్యత సభ్య సమాజం మీద వున్నదని అన్నారు.


