అణగారిన వర్గాల ఆశా జ్యోతి డా. బి.ఆర్. అంబేడ్కర్ జయంతి సందర్బంగా ప్రజలందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్(Bandi Sanjay). బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… అంబేడ్కర్ జయంతి సందర్బంగా భారతీయ జనతా పార్టీ సామజిక న్యాయ వారోత్సవాల పేరుతో ఈనెల 6 వ తారీకు నుండి ఇప్పటి వరకు అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. ఈరోజు కూడా బీజేపీ నాయకులు అందరూ అంబేడ్కర్ మహనీయుడికి ఘననివాళులు అర్పిస్తున్నారని అన్నారు. బీజేపీ చేస్తున్న కార్యక్రమాల్లో ఈ కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ… అంబేడ్కర్(Ambedkar) యొక్క ఆలోచనను వారి ఆశయాలను ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఉద్దేశ్యం తోనే పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సూచనల మేరకు కొనసాగిస్తున్నామని అన్నారు.
నిత్య జీవితంలో చిన్నప్పటినుంచే అనేక ఇబ్బందులు ఎదుర్కొని, ఎక్కడా వెనకడుగు వేయకుండా ఈదేశంలో పేద ప్రజలు బాగుపడాలి.. అణగారిన వర్గాలకు న్యాయం జరగాలి అన్న ఆలోచనతో నిత్యం వారికోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి డా. బి.ఆర్. అంబేడ్కర్ అని బండి సంజయ్(Bandi Sanjay) కొనియాడారు. రాబోయే తరాలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అనేక సంస్కరణలు చేస్తున్న గొప్ప వ్యక్తి అని అభివర్ణించారు. భారత రాజ్యాంగ నిర్మాతగా ఎదిగి… ప్రజాస్వామ్యానికి దిక్సూచి అంబేడ్కర్ అని ఐక్యరాజ్యసమితి పొగిడిందంటే.. అయన ఎంత గొప్ప వ్యక్తో సమాజం ఆలోచించాలని అన్నారు. బి.ఆర్. అంబేడ్కర్ భిక్ష వల్ల, వారి ఆలోచన వల్ల ఈరోజు భారత్ గుర్తింపు పొందింది అంటే.. అది అయన ఆలోచన విధానం అని అన్నారు. 370 ఆర్టికల్ ను వ్యతిరేకించిన్న వ్యక్తి అంబేడ్కర్ అని అన్నారు. దేశ విభజనను వ్యతిరేకించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేడ్కర్ అని వ్యాఖ్యానించారు.