స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఎప్పుడూ బీఆర్ఎస్ నాయకులపై రెచ్చిపోయే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై మాత్రం ప్రశంసలు కురిపించారు. మంత్రిగా తలసాని చాలా బాగా పనిచేస్తున్నారని.. సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నారని తెలిపారు. రాజాసింగ్ నియోజకవర్గమైన గోషామహల్ ప్రాంతంలో నిర్మించిన 120 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను తలసాని, హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు.
అనంతరం లబ్ధిదారులకు డబల్ బెడ్రూమ్ ఇళ్లను అందించారు. కొంత ఆలస్యమైనా లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వడం.. చాలా సంతోషంగా ఉందని రాజాసింగ్ పేర్కొన్నారు. మరికొందరు పేదలు కూడా ఇళ్లు అడుగుతున్నారని వారికి కూడా ఇళ్లు కట్టి ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా ఇటీవల సచివాలయానికి తనను ఆహ్వానించి తలసాని అవమానించారని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అలాంటిది తాజాగా ఆయనను పొగడడం హాట్ టాపిక్ గా మారింది.


