స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తన రాజకీయ జీవితంలో ఏనాడూ పదవుల కోసం పనిచేయలేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. పార్టీలో తన సేవలు ఎలా ఉపయోగించుకోవాలనేది అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. ఎలాంటి బాధ్యతలు అప్పగించినా సమర్థవంతంగా పనిచేస్తానని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ బాగా పనిచేస్తున్నారని.. సంజయ్ తో తనకు ఎలాంటి వివాదం జరగలేదని.. అవన్నీ ఒట్టి పుకార్లేనని స్పష్టంచేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయింది అన్నారు. కర్ణాటకలో గెలవగానే తెలంగాణలో గెలుస్తుందా?అని ప్రశ్నించారు. కాంగ్రెస్ , బీఆర్ఎస్ భవిష్యత్తులో కలిసి పనిచేసే అవకాశాలు కనపడుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్ పార్టీలోకి వెళ్లారని ఈ సందర్భంగా ఈటల గుర్తుచేశారు.
ఇక ఉద్యమ సమయంలో ఆంధ్ర వాళ్ళు తెలంగాణ భూములను కొల్లగొడుతున్నారని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఏం చేస్తున్నారని నిలదీశారు. కేవలం తన కుటుంబ సభ్యుల భూముల కోసమే జీవో111 ఎత్తివేస్తాం అంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. భూముల స్కాంతో వచ్చిన డబ్బుతో రాజకీయాలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తన లాంటి వారిని ఓడించేందుకు ఓటుకు ఐదు వేల రూపాయలు ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఈటల వెల్లడించారు.