స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: దక్షిణాది రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రంలో బీజేపీ అధికారం కోల్పోయింది. దీంతో దక్షిణాదిలో పాగా వేయాలనుకున్న కమలం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది. కర్ణాటకలో గెలిచి తెలంగాణలో కూడా సత్తా చాటాలని భావించిన బీజేపీకి ఈ ఫలితాలు మింగుడుపడడం లేదు. ఉత్తరాదిలో బలంగా ఉన్న ఆ పార్టీకి తొలి నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో బలం లేదు. ఒక్క కర్ణాటకలో మాత్రమే అధికారంలోకి వస్తూ ఉండేది. ఇప్పుడు అక్కడ కూడా ఓడిపోవడంతో సౌత్ లో కమలం పట్టు కోల్పోయింది.
తమిళనాడులో డీఎంకే, కేరళలో సీపీఎం, తెలంగాణలో బీఆర్ఎస్ పూర్తిగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇక ఏపీలోని వైసీపీ ప్రభుత్వం మాత్రం బీజేపీతో సఖ్యతగా ఉంటూ వస్తోంది. అయితే ఆ రాష్ట్రంలో కనీసం సింగిల్ డిజిట్ స్థానాలు కూడా గెలిచే అవకాశాలు లేవు. దీంతో వచ్చే లోక్ సభ ఎన్నికల్లోనూ దక్షిణాదిలో బీజేపీకి పరాభవం తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.