మూసీ నదిని ప్రక్షాళన చేయండి, కానీ, పేదల ఇళ్లను మాత్రం కూల్చకండి అనే నినాదంతో మూసీ నిద్ర కార్యక్రమానికి సిద్ధమైంది బీజేపీ. ఇవాళ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని మూసీ పరివాహక ప్రాంతంలో చేపట్టనున్నారు కమలనాథులు.
ప్రక్షాళన, సుందరీకరణ, పునరుజ్జీవం ఇలా పేర్లు ఏదైనా పేదల ఇళ్లు కూలగొట్టి.. మూసీని ప్రక్షాళన చేస్తామంటే ఊరుకునేది లేదంటూ ఇప్పటికే బీజేపీ తేల్చిచెప్పింది. పైగా సీఎం రేవంత్‌రెడ్డి సవాలును స్వీకరించి రంగంలో దిగుతున్నారు కమలనాథులు. మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలతో మమేకమై వారి ఇళ్లలోనే నిద్రించి వారికి అండగా ఉంటామన్న సంకేతాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా మూసీ నిద్ర కార్యక్రమం చేపట్టారు.
కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పిలుపుమేరకు పార్టీకి చెందిన నేతలు వివిధ ప్రాంతాల్లో మూసీ నిద్ర చేయనున్నారు. రాత్రి భోజనంతోపాటు ఉదయం టిఫిన్ సైతం అక్కడే చేస్తారు కాషాయ పార్టీ నాయకులు. తులసీరామ్‌నగర్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మూసీ నిద్ర చేయనుండగా.. మలక్‌పేట శాలివాహన నగర్‌లో ఎంపీ లక్ష్మణ్, ఎల్బీనగర్ ద్వారకాపురంలో ఎంపీ ఈటల ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.