లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీలు వ్యూహప్రతివ్యూహాల్లో మునిగి తేలుతున్నాయి. పొత్తులు, అభ్యర్థుల ఖరారు కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నాయి.
టీడీపీ, బీజేపీ, జనసేనల మధ్య పొత్తు పొడిచింది. ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తులో ఉండగా.. ఈ పొత్తులో బీజేపీ కూడా చేరింది. పొత్తు ఫిక్స్ కావడంతో దాదాపు ఆరేళ్ల తర్వాత టీడీపీ మళ్లీ ఎన్డీఏలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. రాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని నేతలు నిర్ణయించారు. ఈ సంద ర్భంగా ఎన్డీయేలోకి టీడీపీని బీజేపీ ఆహ్వా నించింది. త్వరలో జరగబోయే ఎన్డీయే భేటీకి టీడీపీ హాజర య్యే అవకాశం ఉంది. ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై మూడు పార్టీల మధ్య అవగాహన కుదిరినట్లు సమాచారం.మరోవైపు.. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ, జనసేన భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో బీజేపీకి మద్దతు ఇవ్వాలని ఈ రెండు పార్టీలు ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో ఈ మూడు పార్టీల మధ్య పొత్తు నేపథ్యంలో ఈ దిశగా టీడీపీ, జనసేన ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ పోటీ చేయలేదు. జనసేన మాత్రం బీజేపీతో కలిసి పోటీ చేసింది. ఏపీలో పొత్తుల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. హైకమాండ్ పిలుపుతో కిషన్ రెడ్డి హస్తినకు వెళ్లారు. తెలంగాణలో ఇప్పటికే 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా… మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేయనున్నట్లు తెలుస్తోంది.


