హైదరాబాద్: రాష్ట్ర నేతలకు తోడు జాతీయ నేతల రంగ ప్రవేశంతో తెలంగాణలో ప్రచారం హోరెత్తుతోంది. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. మాటల తూటాలు పేలుస్తున్నారు. అయితే.. ప్రచారం సందర్భంగా ఆయా నేతలు చెబుతున్న మాటలు.. చేస్తున్నవిమర్శలే ఓటర్లను కొంత మేర ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
ఎక్కడిదాకో ఎందుకు తాజాగా తెలంగాణలో ప్రధాని మోదీ సుడిగాలి ప్రచారం నిర్వహించారు. తూప్రాన్ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. బీజేపీని అధికారంలోకి తేవాలన్న సంకల్పం ప్రజల్లో మొదలైందని చెప్పుకొచ్చారు. నీళ్ల పేరు చెప్పి నిధులన్నింటినీ కేసీఆర్ దోచుకున్నారని ఆరోపించారు. అంతేకాదు.. రైతులను మోసం చేసే విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకరికి ఒకరు తీసిపోరంటూ.. ఇద్దరూ ఇద్దరేనని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కే పరిమితమయ్యారని.. సచివాలయానికి వెళ్లని సీఎం మనకు అవసరమా అంటూ ప్రశ్నించారు మోడీ.
ప్రస్తుత ఎన్నికలు దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్నాయంటూ అభివర్ణించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. సంగారెడ్డి, కామారెడ్డిలో ప్రచారం నిర్వహించిన ఆయన.. 20 లక్షల ఎకరాలు ప్రజల్నుంచి లాక్కోవడమే ధరణి ఉద్దేశమని ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకటేనన్నారు. బీజేపీ తీసుకొచ్చే ప్రతి చట్టానికి బీఆర్ఎస్ మద్దతిస్తున్న విషయాన్ని ఈ సందర్బంగా గుర్తు చేశారు రాహుల్.
ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు గులాబీ బాస్ కేసీఆర్. కాంగ్రెస్ పాలనలో సంక్షేమం ఎలా జరిగిందో అందరికీ తెలుసన్న ఆయన.. తాగునీరు కూడా హస్తం పాలనలో ఇవ్వలేదన్నారు. రైతు బంధు దుబారా అని కాంగ్రెస్ నేతలు అంటున్నారని ఫైరయ్యారు. అసలు.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శనాస్త్రాలు సంధించారు కేసీఆర్.
ఇంతకీ ఆయా పార్టీల నేతలు ఆరోపించినట్లుగా ఎవరెవరు ఒకటి..ఎవరెవరు వేర్వేరు.. వీళ్ల ప్రచారాలను ప్రజలు ఎలా తీసుకుంటున్నారు అన్నది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.