స్వతంత్ర వెబ్ డెస్క్: నరేంద్ర మోడీ 9ఏళ్ల పాలనలో చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు దేశవ్యాప్తంగా బహిరంగ సభలను నిర్వహిస్తుంది బీజేపీ. ఈ కార్యక్రమాల్లో భాగంగా నేడు ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తిలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమైంది. ఈ సభకి ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానుండడంతో పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా సభ ఏర్పాట్లు చేస్తున్నాయి. శ్రీకాళహస్తిలోని భేరివారి మండపం వద్ద నేటి సాయంత్రం జరిగే సభకి భారీ ఏర్పాట్లు చేసారు బీజేపీ నాయకులు. బీజేపీ అగ్ర నేతలు సోమువీర్రాజు, పురందేశ్వరి, సుజనా చౌదరి, కిరణ్‌కుమార్ రెడ్డి,సీఎం రమేష్, జీవీఎల్ నరసింహా రావు, టీజీ వెంకటేశ్, విష్ణువర్ధన రెడ్డి తదితరులు ఇప్పటికే తిరుపతి చేరుకున్నారు. శుక్రవారం రాత్రి 11గంటలకు తిరుపతి విమానాశ్రయం చేరుకున్న జేపీ నడ్డాకు పార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన వెంట తిరుమల వెళ్లారు. శ్రీకృష్ణ గెస్ట్‌హౌస్‌లో బసచేసిన నడ్డా శనివారం ఉదయం 10గంటలకు శ్రీవారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు తిరుచానూరు రాహుల్ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుని చిత్తూరు జిల్లా బీజేపీ నేతలతో సమావేశమౌతారు.సాయంత్రం 3.40 గంటలకు శ్రీకాళహస్తి చేరుకుని శ్రీకాళహస్తీశ్వరస్వామిని దర్శించుకుంటారు.4.30 నుంచి 5.40గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం ప్రత్యేక విమానం ద్వారా ఢిల్లీకి వెళ్తారు.