ట్రంప్ వచ్చాడు.. కొంప ముంచాడు. అమెరికాలో ఉన్న వలసదారుల మాట ఇప్పుడు ఇదే. దాదాపు వందేళ్లుగా అనుసరిస్తున్న విధానానికి స్వస్తి పలికిన ట్రంప్.. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. దీంతో.. జన్మత: లభించే పౌరసత్వంపై ఇకపై విదేశీయులు ఆశలు వదిలేసుకోవాల్సిందేనని చెప్పాలి.
అంతా నా ఇష్టం.. అనే మాటకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నూటికి నూరు శాతం న్యాయం చేస్తున్నారా అంటే అవుననే వాదన విన్పిస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం ఏదైతే ఆయన చెప్పారో వాటిని తక్షణం అమలు చేయడం ప్రారంభించారు. ఇంకా చెప్పాలంటే క్షణం ఆలస్యం చేయకుండా డ్యూటీలో దిగిన డొనాల్డ్ ట్రంప్.. ఎడాపెడా ఫైళ్లపై సంతకాలు చేస్తున్నారు.
ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లలో అత్యంత ప్రధానమైనది జన్మత: లభించే పౌరసత్వం. అంటే.. అమెరికాకు వలస వచ్చిన వారికి యూఎస్ గడ్డపై పిల్లలు పుడితే ఆ చిన్నారులకు సహజంగా ఇన్నేళ్లుగా పౌరసత్వాన్ని అందిస్తూ వచ్చారు. దాదాపు వందేళ్లుగా ఈ చట్టం అమలులో ఉంది. దీనిపైనే ఫోకస్ పెట్టారు డొనాల్డ్ ట్రంప్. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్లుగానే ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టడం ఆలస్యం.. వెంటనే దీనిని రద్దు చేశారు. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం పిల్లలకు ఈ హక్కు సంక్రమించాల్సి ఉంటుంది. దీనిపైనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు ప్రెసిడెంట్ ట్రంప్.
ప్రపంచ వ్యాప్తంగా అమెరికా మాత్రమే ఇలాంటి పౌరసత్వం అందిస్తోందని ట్రంప్ తప్పుగా చెప్పడంపై ప్రశ్నలు తలెత్తాయి. నిజానికి వరల్డ్ వైడ్‌గా 30 దేశాలు ఈ తరహా పౌరసత్వాన్ని అందిస్తున్నాయి. అమెరికాలో వెల్లువెత్తిన అంతర్యుద్దం తర్వాత 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ.. శరణార్థులుగా వచ్చిన పిల్లలకు జన్మత: పౌరసత్వాన్ని అందిస్తోంది.
ఈ విధానం సుమారుగా వందేళ్లకు పైగానే కొనసాగుతోంది. అక్రమంగా అమెరికాలోకి వచ్చిన వారికి పుట్టిన పిల్లలకు, టూరిస్ట్ లేదా స్టూడెంట్ వీసాపై వచ్చిన వారికి అమెరికాలో కాన్పు కాగా పుట్టిన పిల్లలకూ ఈ నియమం వర్తిస్తుంది. అయితే… ఈ విధానాన్ని ట్రంప్ రద్దు చేయడంపై ఓవైపు అమెరికన్లలో హర్షం వ్యక్తం అవుతున్నా న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశాలున్నాయన్న ప్రచారం సాగుతోంది.
అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ట్రంప్ జారీ చేసిన ఈ ఉత్తర్వులతో వలసదేశాల నుంచి వచ్చిన వారి గుండెలు గుబేల్‌మన్నాయి. ఇలాంటి వేళ పూర్తి నిబంధనలు వెలువరించారు అమెరికన్ అధికారులు. తల్లితండ్రుల్లో ఒకరికైనా యూఎస్ సిటిజన్ షిప్, శాశ్వత నివాసం, యూఎస్ మిలిటరీలో సభ్యత్వం.. ఇలా ఏదో ఒక గుర్తింపు తప్పనిసరిగా ఉంటే మినహాయింపు ఇవ్వనుంది ట్రంప్ ప్రభుత్వం.
డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నఈ నిర్ణయంతో ప్రపంచ దేశాలు ఈ డెసిషన్ ఎఫెక్ట్ తమపై ఎంత మేరకు ఉంటుందన్న లెక్కలు చూసుకునే పనిలో పడ్డాయి. మన దేశం విషయానికి వస్తే… 2024 గణాంకాల ప్రకారం చూస్తే.. అమెరికాలో 50 లక్షల మందికి పైగా భారతీయ అమెరికన్లు ఉన్నారు. అమెరికా జనాభాలో 1.47 శాతం వీళ్లే ఉండడంతో పెద్ద ఎత్తున దీని ప్రభావం మన దేశంపై ఉండనుంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.