జనసేన పార్టీ తిరుపతి ఇన్చార్జ్ కిరణ్ రాయల్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. కిరణ్ రాయల్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన లక్ష్మిని జైపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఓ ఆన్ లైన్ ఛీటింగ్ కేసులో లక్ష్మి ప్రధాన ముద్దాయిగా ఉన్నారట. ఇన్ని రోజులు ఆమె పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్నట్లు తెలుస్తోంది. గత రెండు రోజులుగా కిరణ్ రాయల్ పై పలు ఆరోపణలు చేస్తూ మీడియా, సోషల్ మీడియాలో కనిపిస్తుండటంతో జైపూర్ పోలీసులు ఆమె కోసం మాటు వేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన అనంతరం.. ఆమె కిందకు దిగి రాగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జైపూర్ లో చెక్ బౌన్స్ , చీటింగ్ కేసులు ఆమెపై ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.
మహిళ ఆరోపణలు ఏంటి?
జన సేన పార్టీ ఇంచార్జీ కిరణ్ రాయల్ పై లక్ష్మి తీవ్ర ఆరోపణలు చేసింది. తనను బెదిరించి, మోసం చేసి, అన్ని విధాలుగా వాడుకొని, కోటి రోపాయలకు పైగా డబ్బులు కాజేశాడని సదరు మహిళ ఆత్మహత్య చేసుకుంటాను అంటూ వీడియో విడుదల చేసి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె ఆరోపణల ప్రకారం.. తిరుపతి బైరాగపట్టడుగు చెందిన లక్ష్మీ అనే మహిళకు కిరణ్ రాయల్ కు సన్నిహిత సంబంధం ఉందట… లక్ష్మి అనేక దఫాలుగా కోటి 20 లక్షల రూపాయల వరకు కిరణ్ రాయల్ కు అప్పు ఇచ్చిందట. ఈ డబ్బు వ్యవహారంలో 2022 సంవత్సరం నుంచి కిరణ్ రాయలకు లక్ష్మి మధ్య వివాదం జరుగుతోంది. తాజాగా లక్ష్మి వీడియో విడుదల చేస్తూ ఆ వీడియోలు తాను కిరణ్ రాయల్ తనను మోసం చేశారని తనను బెదిరించి 30 లక్షల రూపాయలకు చెక్కులు, బాండ్లు రాయించుకున్నారని ఆరోపించింది. డబ్బులు అడిగితే తన పిల్లలను చంపుతాడని బెదిరిస్తున్నానని పేర్కొంది. కిరణ్ రాయల్ వలనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని.. తాను చనిపోయిన తర్వాత అయినా తన డబ్బులు తన పిల్లలకు చెందాలని కోరింది. ఈ వీడియో వైరల్ గా మారింది.
కిరణ్ రాయల్ ఏమన్నారంటే.. ?
“వైసిపి దొంగల ముఠా నాపై కక్ష కట్టింది. వైసిపి నేతలు సోషియల్ మీడియా వేదికగా నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. క్రిమినల్ కిలాడీ లేడీ లక్ష్మితో నాపై నిరాధారణమైన ఆరోపణలు చేయిస్తున్నారు. కోటి 20లక్షల రూపాయలు నాకు ఇచ్చినట్లు లక్ష్మి దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. 2016సంవత్సరంలో 50లక్షల రూపాయల చీటీలు వేశాం. చీటీలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఎప్పుడో ముగిశాయి. వైసిపి నాపై ఆడుతున్న చిల్లర రాజకీయం. అప్పుల భాదతో మనస్థాపంతో లక్ష్మి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. లక్ష్మిపై గతంలో ఎన్నో కేసులున్నాయి. లక్ష్మిపై ఆరు కేసులున్నాయి..భూమన అభినయరెడ్డి నాపై చిల్లర రాజకీయాలు చేయిస్తున్నాడు. భూమన అభినయరెడ్డి లక్ష్మిని రెచ్చగొట్టి నాపై పనికిమాలిన ఆరోపణలు చేయిస్తున్నాడు. జగన్ రెడ్డిని చిట్టి రెడ్డి అని..భూమన కుటుంబంపై విమర్సలు చేసినందుకే నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. చిల్లర రాజకీయాలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. పెయిడ్ ఆర్టిస్టులతో ఆరోపణలు చేయినంత మాత్రాన అబద్థాలు నిజం కావు”..అని కిరణ్ రాయల్ అన్నారు.
విచారణకు ఆదేశించిన పవన్ కళ్యాణ్
మహిళ ఆరోపణలపై జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించారు. లక్ష్మి .. కిరణ్ రాయల్ పై చేసిన ఆరోపణల్లో నిజమెంత ఉందో తెలుసుకోవాలన్నారు. అప్పటి వరకు కిరణ్ రాయల్ ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు. ఓ వైపు కిరణ్ రాయల్ పై విచారణ జరుగుతుండగానే లక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ వ్యవహారం మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో ఏది నిజమో.. అటు పోలీసులు.. ఇటు జనసేన పార్టీ తేల్చే పనిలో ఉన్నారు.