స్వతంత్ర వెబ్ డెస్క్: లండన్ వేదికగా జరుగుతున్న వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో అతి పెద్ద సంచలనం నమోదైంది. వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకర్, ఇటీవలే ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గి జోరు మీదున్న పోలాండ్ యువ సంచలనం ఇగా స్వియోటెక్‌కు భారీ షాక్ తగిలింది. వింబూల్డన్ తొలి క్వార్టర్స్ పోరులో ఉక్రెయిన్ క్రీడాకారిణి, ప్రపంచ 76వ ర్యాంకర్ ఎలీనా స్వితోలినా.. స్వియాటెక్‌ను ఓడించి సెమీస్‌కు చేరింది. క్వార్టర్స్‌లో స్వితోలినా.. 7-5, 6-7 (5/7), 6-2 తేడాతో స్వియాటెక్‌ను ఓడించింది. మహిళల సింగిల్స్ లో వరల్డ్ నెంబర్ వన్ ఇగా స్వైటెక్ క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది.
తొలి సెట్ ను స్విటోలినా చేజిక్కించుకోగా, రెండో సెట్ లో ఓటమి అంచుల్లోకి వెళ్లి మరీ బయటపడిన స్వైటెక్, ఆ సెట్ ను టైబ్రేకర్ లో గెలుచుకుంది. అయితే మూడో సెట్ లో అదే ఊపు కనబర్చడంలో విఫలమైన స్వైటెక్ ప్రత్యర్థికి తేలిగ్గా తలవంచింది. చివరి సెట్ లో స్విటోలినా పలుమార్లు స్వైటెక్ సర్వీస్‌ను బ్రేక్ చేయడమే అందుకు నిదర్శనం. కాగా, సెమీస్ లో స్విటోలినా.. చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి మార్కెటా వోండ్రొసోవాతో తలపడనుంది.