స్వతంత్ర వెబ్ డెస్క్: తిరుమలలో(Tirumala) చిన్నారి లక్షితపై(Lakshita) దాడి చేసిన చంపేసిన చిరుత బోనుకు చిక్కింది. రెండ్రోజుల క్రితం మెట్ల మార్గంలో కాలినడకన వెళుతున్న చిన్నారిని చిరుత(Leopard) లాక్కుపోయింది. నెల్లూరు జిల్లా పోతిరెడ్డి పాలెంకు(Pothireddy Palem) చెందిన దినేష్ శశికళ దంపతులు శుక్రవారం తిరుపతి వచ్చారు. కాలి నడకన మెట్ల మార్గంలో తిరుమల వెళ్లేందుకు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో నడక ప్రారంభించారు. సాయంత్రం ఆరున్నర ఏడు గంటల సమయంలో 7వ మలుపు తర్వాత చిన్నారి లక్షిత కనిపించకుండా పోయింది. దీంతో స్థానికంగా బంధువులు వెదుకులాడినా ఫలితం లేకపోవడంతో పోలీసుల్ని రాత్రి పది గంటల సమయంలో ఆశ్రయించారు.
శనివారం ఉదయం మెట్ల మార్గానికి సమీపంలోని గుట్టపై చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అటవీ శాఖ నాలుగు బోన్లను ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయానికి అటవీ శాఖ ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. పూర్తి ఆరోగ్యంతో ఉన్న చిరుత ఆహారం కోసం మళ్లీ అదే ప్రాంతానికి వచ్చి దొరికిపోయింది. చిన్నారి లక్షిత మృతదేహం కనిపించిన వెంటనే అటవీ శాఖ అప్రమత్తమైన పలు ప్రాంతాల్లో బోన్లను ఏర్పాటు చేశారు. అలిపిరి మెట్ల మార్గంలో లక్ష్మీనరసింహ ఆలయంలో ఏర్పాటు చేసిన బోనులోనే అది చిక్కింది.
మరోవైపు తిరుమల(Thirumala) భద్రతా ఏర్పాట్లపై నేడు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి(Bhumana Karunakar Reddy) ఆధ్వర్యంలో హైలెవల్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తిరుమలలో చిన్నారిపై చిరుత దాడి నేపథ్యంలో 15 ఏళ్లలోపు పిల్లల్ని మెట్ల మార్గంలో పంపకూడదని నిర్ణయించారు. తిరుమల ఏడో మలుపు వద్ద పిల్లలకు ట్యాగ్‌లు వేయడాన్ని ఆదివారం ప్రారంభించారు. తిరుమల నడక మార్గంలో పలు ప్రాంతాల్లో చిరుతల కదలికల్ని అటవీ శాఖ గుర్తించింది. అలిపిరి మార్గంలో రాత్రి పదిగంటల వరకు మెట్ల మార్గంలో సాయంత్ర ఆరుగంటల వరకు మాత్రమే భక్తుల్ని అనుమతిస్తారు. రెండు మార్గాల్లో 15ఏళ్లలోపు చిన్నారుల్ని మధ్యాహ్నం రెండు గంటల లోపు మాత్రమే కాలి నడకన అనుమతించనున్నారు.