స్వతంత్ర వెబ్ డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. తనను ఈడీ కార్యాలయానికి పిలిచి విచారించడంపై కవిత సుప్రీంను ఆశ్రయించగా ఆమె పిటీషన్ ను కోర్టు పరిగణలోకి తీసుకుంది. అంతేకాదు.. కవిత పిటీషన్ పై విచారణ జరిపిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక మహిళను ఈడీ కార్యాలయానికి పిలిచి విచారించవచ్చా అనే అంశాన్ని పిటీషన్ లో పేర్కొన్నారని..ఆ అంశాన్ని పూర్తిగా పరిశీలిస్తామని కోర్టు స్పష్టం చేసింది. అలాగే కవిత పిటీషన్ పై ఆరు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని కోర్టు ఆదేశించింది. ఆ తరువాత రెండు వారాల్లో రిజోఇండర్ పిటీషన్ ను దాఖలు చేయాలని కోర్టు కవితకు సూచించారు.
కవిత పిటీషన్ ను విచారించిన జస్టిస్ సంజయ్ కిషన్ కౌర్ దీనిని పరిగణలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. అలాగే తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. అయితే కవిత పిటీషన్ ను కోర్టు పరిగణలోకి తీసుకోవడం..ఆమె అభ్యర్థిత్వంపై కోర్టు సానుకూలంగా స్పందించడంతో ఆమెకు ఊరట లభించినట్లయింది. కాగా కవిత తరపున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, ముకుల్ రోహత్గి తమ వాదనలను వినిపించారు. మరి తదుపరి విచారణ సమయానికి ఈడీ కౌంటర్ దాఖలు చేయాల్సి ఉండగా..అలా జరిగితే కవిత రిజోఇండర్ పిటీషన్ వేయాల్సి వస్తుంది.