స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అయితే ఆయనను మాత్రం సీఎంగా పునరుద్ధించలేమని తెలిపింది. శివసేన పార్టీలో తలెత్తిన సంక్షోభంపై ఉద్దవ్ థాక్రే, ఏక్ నాథే షిండే వర్గాలు దాఖలు చేసిన పిటిషన్లపై సీజీఐ డిజే చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోకుండానే ఠాక్రే రాజీనామా చేయడంతో ఆయనను సీఎంగా తిరిగి నియమించేలా తీర్పు ఇవ్వలేమని వ్యాఖ్యానించింది. సంక్షోభ సమయంలో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ వ్యవహరించిన తీరును తప్పుపట్టింది.
ఈ క్రమంలోనే షిండే వర్గానికి చెందిన గోగావాలేను విప్ గా నియమించడం చెల్లదని స్పీకర్ నిర్ణయాన్ని తప్పుబట్టింది. ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకరే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. రెబల్ ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసులు జారీ చేసే అధికారాలు ఉంటాయా లేదా అనే అంశంపై మరింత అధ్యయనం చేయాల్సి ఉందని అభిప్రాయపడింది. అందుకే ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నామని చెప్పింది.
సుప్రీం తీర్పు నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని హత్య చేసి షిండే అధికారంలోకి వచ్చారని.. తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇది తమకు నైతిక విజయమని శివసేన నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.