స్వతంత్ర వెబ్ డెస్క్: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పూర్తి భావోద్వేగాలతో కూడిన వినోదం పంచడంలో బిగ్ బాస్ రియాలిటీ షో ముందుంటుంది. ఇప్పటివరకు ఆరు సీజన్లను విజయవంతంగా పూర్తిచేసుకున్న బిగ్ బాస్ .. ఇప్పుడు ఏడవ సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ కార్యక్రమ ప్రసారకర్త స్టార్ మా ఛానెల్ తాజాగా బీబీ7 ప్రోమో విడుదల చేసింది. రెడీగా ఉండండి.. ఎమోషన్ల ఎత్తుపల్లాల్లో మిమ్మల్ని ఉర్రూతలూగించడానికి బిగ్ బాస్ తెలుగు సీజన్-7 వచ్చేస్తోంది అని స్టార్ మా ఛానల్ పేర్కొంది. మరిన్ని సర్ ప్రైజ్‌లు, మరిన్ని థ్రిల్లింగ్ మూమెంట్స్.. సిల్లీ ఫైట్స్ నుంచి హృదయాలు బరువెక్కించే గాథల వరకు.. సంపూర్ణ వినోదం గ్యారెంటీ అని మేం మీకు హామీ ఇస్తున్నాం అని వివరించింది. ఈ కార్యక్రమం ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లోనూ స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు.
ఈ ప్రకటనతో పలువురు నెటిజన్లు, బిగ్‌బాస్ ఫ్యాన్స్ నెట్టింట ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీజన్ 7కి వ్యాఖ్యాతగా ఎవరు వ్యవహరిస్తారు? కంటెస్టెంట్లు ఎవరు? అంటూ కామెంట్ల రూపంలో చర్చ సాగిస్తున్నారు. 3, 4, 5, 6 సీజన్లను హోస్ట్ చేసిన ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున ఈ కొత్త సీజన్‌కీ వ్యాఖ్యాతగా ఉంటారని టాక్ వినిపించగా, మరోవైపు, రానా దగ్గుబాటి పేరు తెరపైకి వచ్చింది. వీరితో పాటు మరో అగ్ర కథానాయకుడి పేరు ప్రచారంలో నిలిచింది. మరి, వీరిలో ఎవరు ఆ ఛాన్స్ అందుకున్నారో తెలియాలంటే అధికారిక ప్రకటన వెలువడాల్సిందే. సెప్టెంబరు మొదటి వారంలో ఈ షో ప్రారంభం కానుందని సమాచారం. సీజన్ 1లో ఎన్టీఆర్, సీజన్ 2లో నాని హోస్ట్‌గా సందడి చేసిన సంగతి తెలిసిందే.