అగ్రరాజ్య అధికారం పీఠం కోసం మరోసారి జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ తలపడే అవకాశాలే కనిపిస్తున్నాయి. 15 రాష్ట్రాలు, ఒక టెర్రిటరీలో ‘సూపర్ ట్యూస్‌డే’ పేరిట జరిగిన ప్రైమరీలలో ఈ డెమోక్రాటిక్, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థులు ఘనవిజయాలు సాధించారు. 77 ఏళ్ల ట్రంప్ ఒక్క వెర్మాంట్‌లో తప్ప మిగిలిన రాష్ట్రాల్లో జయకేతనం ఎగరవేశారు. వెర్మాంట్‌ను భారత సంతతి అమెరికన్ నిక్కీ హేలీ కైవసం చేసుకున్నారు. మిగతా ప్రైమరీల్లోనూ ఆమె మాజీ అధ్యక్షుడికి గట్టి పోటీ ఇచ్చారు. అయితే తాజా ఓటములతో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష నామినేషన్ రేసు నుంచి తప్పుకుంటున్నట్లు హేలీ ప్రకటించారు. తన ప్రచారాన్ని నిలిపివేస్తున్నట్లు తెలిపారు. దీంతో రిపబ్లికన్ అధ్యక్ష రేసులో ట్రంప్ ఒక్కరే మిగిలారు. ఆయన పార్టీ నామినేషన్ సాధించడానికి కావాల్సిన 1215 మంది ప్రతినిధులను ఇంకా సొంతం చేసుకోలేదు.
ప్రస్తుతం ట్రంప్ ఖాతాలో 995 మంది ఉన్నారు. హేలీ కేవలం 89 మంది ప్రతినిధులనే గెలుచు కున్నారు. మరోవైపు డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష నామినేషన్ రేసులో ఉన్న 81 ఏళ్ల బైడెన్.. సమోవా టెర్రిటరీ లో తప్ప 15 రాష్ట్రాల్లోనూ విజయం సాధించారు. సమోవాలో జేసన్ పామర్ చేతిలో ఓడారు. బైడెన్ కూడా డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష నామినేషన్‌కు అవసరమైన 1968 ప్రతినిధులను సాధించలేదు.


