కాంగ్రెస్ నాయకుడు చెరకు సుధాకర్ కుమారుడుతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(MP Venkat Reddy) మాట్లాడిన ఆడియో లీకవ్వడం, ఆ వీడియోలో వెంకట్‌రెడ్డి బెదిరించడం తీవ్ర కలకలం రేపింది. ఈ క్రమంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన వ్యాఖ్యలపై స్పందించారు. అవి తాను భావోద్వేగంతో చేసిన వాఖ్యలేనని, వేరే ఉద్దేశ్యం ఏమి లేదన్నారు. తన ౩౩ ఏళ్ల రాజకీయ జీవితంలో తన రాజకీయ ప్రత్యర్ధులను కూడా ఎవరిని దూషించలేదన్నారు. తన శత్రువులను కూడా దగ్గరకు తీసుకునే తత్వం తనదన్నారు. చెరకు సుధాకర్‌ను తిట్టాలనుకుంటే రెగ్యులర్‌గా ఎందుకు ఫోన్ చేస్తానన్నారు. చదువుకున్న వ్యక్తి గా జనరల్ స్థానం అయిన నల్లగొండ మున్సిపాలిటీ ఛైర్మన్ గా వెంకట్ నారాయణ గౌడ్ కు అవకాశం ఇచ్చామని, నల్లగొండ మున్సిపాలిటీ 3 సార్లు జనరల్ అయినప్పటికీ ఆ మూడు సార్లు పట్టుబట్టి బలహీన వర్గాల వారికి దక్కేలా చూశానని తెలిపారు.
తాను మాట్లాడిన కొన్ని విషయాలను కట్ చేసి ఆడియో విడుదల చేశారన్నారు. కావాలనే కొన్ని అంశాలను లీక్ చేశారని తెలిపారు. తాను మాట్లాడేటప్పుడు రికార్డు పెట్టారనే విషయం తనకు తెలుసని అన్నారు. పార్టీ లో చేరిన నాటి నుంచి చెరకు సుధాకర్ తనను తిడుతున్నాడని ఆరోపించారు వెంకట్‌రెడ్డి.. ఎందుకు తిడుతున్నారని అడిగానని, చెరకు సుధాకర్ పై పీడీయాక్ట్ పెడితే.. తానే కోట్లాడాననే విషయాన్ని కోమటిరెడ్డి గుర్తుచేశారు. తనను తిట్టొద్దని మాత్రమే చెరకు సుధాకర్ కుమారుడుకు చెప్పానన్నారు. ఆ విషయాన్ని అన్యదా భావించొద్దని ప్రజలను కోరుతున్నట్లు కోమటిరెడ్డి తెలిపారు.
తనపై నకిరేకల్‌లో పోస్టర్లు ఎవరు వేశారో తనకు తెలుసని, తన వాళ్లు చంపేస్తారామోననే భయంతో మాత్రమే చెప్పానని వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. తనను తిడితే నకిరేకల్ టికెట్ వస్తుందని అనుకుంటున్నారని, తనను వీడు, వాడు అని సంభోదిస్తున్నారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.