భారతదేశంలోని అగ్రశ్రేణి స్కూటర్ తయారీదారులలో ఒకటైన ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ నష్టాలను పూడ్చుకోవడానికి వెయ్యి మందికి పైగా ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రొక్యూర్‌మెంట్, కస్టమర్ రిలేషన్స్, ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా పలు విభాగాల్లో ఈ కోత ఉండనున్నట్లు సమాచారం. ఐదు నెలల వ్యవధిలో ఓలా నుంచి ఇలాంటి వార్తలు రావడం ఇది రెండోసారి. గత నవంబర్‌లో 500 మంది సిబ్బందిని తొలగించినట్లు తెలుస్తోంది.
సీఈవో భవిష్ అగర్వాల్ నేతృత్వంలోని కంపెనీ అనేక రంగాలలో సంక్షోభాలను ఎదుర్కొంటున్నందున ఐదు నెలల్లోపు ఇది రెండో సారి లేఆఫ్స్ వార్తలు ావడం గమనార్హం. డిసెంబర్ త్రైమాసికంలో ఇది నష్టాలలో 50శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఇటీవల కాలంలో భారతదేశ మార్కెట్ నియంత్రణ సంస్థ , వినియోగదారుల రక్షణ అథారిటీచే విమర్శలు ఎదుర్కొంది.
గత నవంబర్‌లో 500 మంది ఉద్యోగులను తొలగించింది. ఇటీవల ఓలా సంస్థ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో రూ.564 కోట్ల నికర నష్టం వచ్చినట్లు తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ప్రకటించిన రూ.376 కోట్ల నష్టంతో పోలిస్తే నష్టాలు మరింత పెరగడం గమనార్హం. మార్కెట్‌లో పోటీ పెరిగి.. ఆదాయలు తగ్గుముఖం పట్టడం, అలాగే సర్వీస్ లోపాలను సరిదిద్దేందుకు పెద్దమొత్తంలో ఖర్చు చేయడం వంటివి నష్టాలకు కారణమయ్యాయి. విస్తరణలో భాగంగా ప్రస్తుతం ఉన్న 800 ఓలా ఎలక్ట్రిక్ స్టోర్ల సంఖ్యను 4 వేలకు పెంచాలని నిర్ణయించుకున్నట్లు ఇప్పటికే కంపెనీ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఎలక్ట్రిక్ బైక్‌ల మార్కెట్‌లో లీడర్‌గా ఉన్న ఓలాపై ఇటీవల కాలంలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ముఖ్యంగా అమ్మకాల తర్వాత సర్వీస్ విషయంలో పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్‌కు 10వేలకు పైనే ఫిర్యాదులు చేయడం.. దీనిపై సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటి విచారణకు ఆదేశించడం వంటి పరిణామాలు ఓలా ఎలక్ట్రిక్‌ను ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఈ పరిణామాలు ఆర్థిక నష్టాలు మార్జిన్లపై ప్రభావం చూపాయి. ఇక తాజాగా లేఆఫ్ వార్తలతో ఆ సంస్థ షేర్ విలువ 5 శాతం తగ్గి, 52 వారాల కనిష్ఠానికి పడిపోయింది. ఇప్పుడు షేర్ ధర రూ.54 వద్ద కదలాడుతోంది.