స్వతంత్ర వెబ్ డెస్క్: జగన్ అందరిని పెయిడ్ ఆర్టిస్టులు అంటాడు… కానీ జగనే పెద్ద డ్రామా ఆర్టిస్టు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) విమర్శించారు. జగన్ సినిమాల్లో నటిస్తే భాస్కర్ అవార్డ్ ఖాయం అని వ్యంగ్యం ప్రదర్శించారు. దసరా వస్తే అందరూ ఆయుధపూజ చేస్తారని, జగన్(Cm Jagan) మాత్రం కోడికత్తి పూజ చేస్తాడని ఎద్దేవా చేశారు. బాబాయ్ మర్డర్ లానే కోడికత్తి ఎపిసోడ్ జగన్ నాటకం అని తేలిపోయిందని స్పష్టం చేశారు. కోడికత్తితో పొడిచింది శ్రీను కాదు బొత్స మేనల్లుడు చిన్న శ్రీను అని న్యాయవాది అసలు విషయం బయటపెట్టాడని లోకేశ్ వెల్లడించారు.
జగన్ అధికారం కోసం కోడికత్తి డ్రామా చేసి ఒక దళితుడి జీవితంతో ఆడుకుంటున్నాడని మండిపడ్డారు. ఉంగుటూరు నియోజకవర్గం గణపవరంలో(Ganapavaram) లోకేశ్ బహిరంగ సభలో ప్రసంగించారు. జగన్ ది దరిద్ర పాదం. ఆయన అధికారంలోకి వచ్చిన రోజు నుండి రాష్ట్రాన్ని దరిద్రం వెంటాడుతోంది. 122 ఏళ్ల తరువాత అత్యంత తక్కువ వర్షపాతం జగన్ పాలనలో నమోదు అయ్యింది. ఆగస్టు నెలలో 32 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. జగన్ ను చూసి వరుణ దేవుడు కూడా పారిపోయాడు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్, అన్నమయ్య డ్యాం కొట్టుకుపోవడం, కచ్చులూరు బోటు ప్రమాదం, కరోనా వచ్చి వేలాది మంది చనిపోవడం వరకూ ఎన్నో ఘటనలు మనం చూశామని నారా లోకేష్ అన్నారు.