బెంగాల్లో ఈనెల ఇరవైన ఏడు లోక్‌సభ సెగ్మెంట్లకు పోలింగ్ జరగబోతోంది. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీల మధ్య ఈసారి హోరాహోరీ పోరు నెలకొంది. సీసీఏ రిజర్వేషన్లు, రాజ్యాంగం, శాంతి భద్రతలు వంటి అంశాలు రాజకీయ పార్టీల ప్రచారంలో ప్రధాన అస్త్రాలుగా ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యక్తిగత ఇమేజ్, ప్రధాని నరేంద్ర మోడీ జనాకర్షణ మధ్య నువ్వా నేనా అనే రీతిలో పోటీ నడుస్తోంది. బరాక్‌పూర్ నియోజకవర్గంలో ఐదో విడతలో భాగంగా పోలింగ్ జరగబోతోంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి అర్జున్ సింగ్, టీఎంసీ అభ్యర్థి పార్థ భౌమిక్, సీపీఎం నుంచి దేబత్ ఘోష్ బరిలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో అర్జున్ సింగ్ గెలుపొందారు. మరోసారి అర్జున్ సింగ్ బరిలో దిగారు. బరాక్ పూర్ అనేక జూట్, టెక్స్ టైల్ మిల్లులకు, ఇషాపూర్ మెటల్, స్టీల్ ఫ్యాక్టరీ వంటి ఇతర పారిశ్రామిక సంస్థలకు కేంద్రంగా ఉంది.
బంగాన్ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. బంగాన్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా శంతన్ ఠాకూర్ బరిలో ఉన్నారు. టీఎంసీ అభ్యర్థిగా విశ్వజిత్ దాస్ పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో శంతన్ ఠాకూర్ గెలుపొందారు. ఇక్కడ మతువా కమ్యూనిటీకి చెందిన వలస ఓటర్లు అధికం. హౌరా నియోజక వర్గం. బెంగాల్ అంతా పాపులర్. బెంగాల్లోనే హౌరా మూడవ అతి చిన్న జిల్లా. హౌరా నుంచి ఈసారి 19 మంది అభ్యర్థులు ఉన్నారు. కిందటిసారి ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థిగా ప్రసూన్ బెనర్జీ విజయం సాధిం చారు. మమతా బెనర్జీ ఇమేజే తనను గెలిపిస్తుందని ప్రసూన్ బెనర్జీ భావిస్తున్నారు.
బెంగాల్లోని ఓ కీలక నియోజకవర్గం ఉలుబెరియా. ఇక్కడి నుంచి ఈసారి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా సజ్జా అహ్మద్, బీజేపీకి చెందిన అరుణ్ ఉదయ్ పాల్ చౌదరి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరఫున అజహర్ మాలిక్ పోటీలో ఉన్నారు. ఉలుబెరియాలో హిందూ, ముస్లిం ఓటర్లు సరిసమానంగా ఉన్నారు. శ్రీరాంపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్‌పై కబీర్ శంకర్ బోస్ అలాగే తృణమూల్ కాంగ్రెస్ టికెట్‌పై కల్యాన్ బెనర్జీ పోటీ చేస్తున్నారు. గతంలో శ్రీరాంపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్, సీపీఎం మధ్య హోరాహోరీ పోరు ఉండేది. 2009 నుంచి కల్యాన్ బెనర్జీ ఈ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ మద్దతుతో సీపీఎం తరఫున దీప్సితాధర్ పోటీ చేస్తున్నారు. కాగా 2021 అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీరాంపూర్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లను తృణమూల్ కాంగ్రెస్ గెలుచు కుంది. ఈ నేపథ్యం లో ఈసారి కూడా గెలుపుపై కల్యాన్ బెనర్జీ ధీమాగా ఉన్నారు.
హుగ్లి నియోజకవర్గంలో ఈసారి బహుముఖ పోటీ నెలకొంది. బీజేపీ నేత లాకెట్ ఛటర్జీ, సీపీఎం నేత మనదీప్ ఘోష్, ఐఎన్‌డీకి చెందిన మృణాల్ కాంతిదాస్ పోటీలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ నేత లాకెట్ ఛటర్జీ గెలుపొందారు. ఈసారి కూడా లాకెట్ ఛటర్జీ గెలుపుపై భరోసాతో ఉన్నారు. అరంబాగ్ నియోజకవర్గంలో ఈసారి హోరాహోరీ పోటీ నెలకొంది. టీఎంసీకి చెందిన మితాలీ బాగ్, బీజేపీకి చెందిన అనూప్ కాంతి దిగార్‌తో తలపడుతున్నారు. అరంబాగ్ ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం. 2019 ఎన్నికల్లో టీఎంసీ ఇక్కడ గెలుపొందింది. ఈసారి కూడా టీఎంసీ దూకుడు మీద ఉంది.