బీహార్ లో బాహాటంగా బంధిపోట్లు లూటీకి పాల్పడ్డారు. చదువు, సంధ్య, మంచి, మర్యాదల విషయం మాట ఎలా ఉన్నా నేరాల్లో, ఘోరాల్లో ఆరితేరిపోయిన గ్యాంగ్ లు మాత్రం ఇక్కడ తెగ కనిపించేస్తాయి. ఈ రాష్ట్రంలో ఏదో పెద్ద పట్నంలో సాయంత్రం ఆరు దాటితే బయటకు ఎవరు రారాని ఆ మధ్య వార్తల్లో వినిపించాయి. అంత భయంకర పరిస్థితులు.. బుద్ధ భగవానుడు నడయాడిన ఈ ప్రాంతంలో ఉన్నాయంటే.. ఇక ఈ దుస్థితి గురించి ఏమనుకోవాలి.
రాష్ట్రంలోని ఆరాలోకి దొంగలు దొరల్లా ప్రవేశించి.. పట్టపగలు…మిట్ట మధ్యాహ్నం తనిష్క్ నగల షోరూంలోకి ఎంటరయ్యారు. ఏ సినిమా సీన్లు పనికిరాని విధంగా…ఇక్కడ భయంకర సీన్ క్రియేట్ చేసేశారు. షోరూం సిబ్బందిపైనా, కస్టమర్లపైనా తుపాకులు గురిపెట్టారు. హృదయాల పాషాణాలు, చేతులోనా గన్ లు, నోట్లోంచి తిట్లు…. ఈ పరిస్థితుల్లో ఎప్పుడు ఎవరి మీద ఇష్టానుసారం కాల్పులు జరుపుతారో, ఎవరి నిండు ప్రాణాలు తీసిపారేస్తారో అని అక్కడున్న అందరూ ఠారెత్తిపోయి.. ముందు చేతులు పైకెత్తేశారు. పక్కకు జరిగి..మన పరమానందయ్య శిష్యుల కథ సినిమా మాదిరి… దొంగలను పెద్ద మనుషుల్లా గౌరవించేశారు. ఆ సినిమాలు శిష్యులు బుద్ధిమాద్యంతో అలా ప్రవర్తిస్తే.. ఇప్పుడు ఇక్కడ బోల్డు బోల్డు తెలివి వున్న మేధావులు…ఈ ఉన్మాద గ్యాంగ్ ఏ దారుణానికి తెగబడుతుందో అని వాళ్లు చెప్పినట్టు చేసేశారు.
ఇక పూర్ణ విషయంలోకి వస్తే… చోరీకి ముందు ఎన్ని ఆరాలు తీశారో ఏమో కాని దొంగల గ్యాంగ్ .. బీహార్ ఆరా లోని తనిష్క్ షోరూంలోకి తూపాకులతో తయారయ్యారు. హ్యాండ్స్ ప్ అంటున్నారో లేదో… అప్పుడే అక్కడి సిబ్బంది వణికిపోయి చేతులెత్తేశారు. ఏ నిమిషానికి ఏమి జరుగునో అంటే.. ఇదే కాదా.. ఎప్పుడూ మాదరి పొద్దునే పదిన్నరకు షాపు తీసి కార్యకలాపాలు సాగిస్తుంటే.. మధ్యాహ్నం వేళ ఆకస్మికంగా అయిదారుగురు వ్యక్తులు ఈ తుపాకీ దందాకు దిగారు.
కరోనా కష్టాలు, వైరస్ వైరల్ సమయాల్లో మాస్క్ లు వేసుకుని.. మరోకరికి ఈ రోగం రాకుండా ఉండేలా మంచి పనులకు జనాలు తలపడగా, ఇప్పుడు చెడ్డ పనికి పాల్పడడానికి, తాము ఎవరో తెలియకుండా ఉండేందుకు మాస్క్ లు వేసుకుని దొంగల గ్యాంగ్ షోరూంలో దూరికూచుంది. ఎవరైనా ఎ కర్రలతోనే తలమీద బాదుతారేమో అని శిరో రక్షణ కవచంగా ఈ దొంగల గ్యాంగ్ హెల్మెట్లను ధరించింది.
షోరూం బయట ఉన్న సెక్యూరిటీ గార్డు చేతిలోనే తుపాకీని లాగేసుకుని, ఆయనను నిస్సహాయుడిగా మార్చేశారు. నోరెత్తితే కాల్చి పారేస్తాం అంటే.. ఎంత సెక్యూరిటీ అయితే మాత్రం చెమటలకు తడిసి ముద్దవ్వకుండా ఉంటారా.. సెక్యూరిటీని వశం చేసేసుకున్నాక.. సిబ్బందిని, వినియోగాదారులను తుపాకులతో బెదిరించి అదరగొట్టేశారు. అందరూ చూస్తుండగానే షో కేసు బాక్సుల్లో భద్ర పర్చిన 25 కోట్ల రూపాయల విలువైన బంగారు నగలను అపహరించి.. అక్కడ నుంచి ఉడాయించారు. ఈ ఘటన మొత్తం సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యింది.
ఎలా తెలిసిందో కాని పోలీసులకు ఈ సమాచారం వెంటనే తెలిసిపోయింది. అలసత్వం, జడత్వం ఏ ఉద్యోగులైనా ప్రదర్శిస్తే పరవాలేదేమో కాని… రక్షక భటులు ఇమ్మిడియట్ ఏక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది కదా..! అందుకే పోలీసులు. దొంగల గ్యాంగ్ వెళ్లిన వైపు వేగంగా వెళ్లారు. వెంబడించి, వెంబడించి.. చోరులపై కాల్పులు జరిపారు. అయితే, కాల్పుల్లో దొంగలు గాయపడ్డారు కాని, పోలీసులకు చిక్కకుండా పారిపోయారు. ఇప్పడు..కేసులు, నమోదులు, దర్యాప్తులు, అన్వేషణల పర్వం సాగిస్తున్నారు. మరి ఎప్పుడు ఈ నేరగాళ్లు పట్టు పడతారో..? పట్టుబడే సమయానికి చోరీ సొత్తు లో ఎంత ఖర్చు చేసేస్తారో, ఎంత రికవరీ అవుతుందో.. అంతా అయోమయంగానే ఉంది.
———————