హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) ‘మహిళా గోస -బీజేపీ భరోసా’(Mahila Gosa BJP Bharosa) పేరుతో దీక్ష చేపట్టారు. బెల్టు షాపులను వ్యతిరేకిస్తూ బీజేపీ మహిళా మోర్చా నేతలతో కలిసి దీక్షకు దిగాడు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని మహిళా మోర్చా ఆందోళన వ్యక్తం చేసింది. మద్యాన్ని రాష్ట్రంలో బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తూ దీక్ష ప్రారంభించింది. రాష్ట్రంలో బెల్టు షాపుల దందాపై మహిళా మోర్చా ఆందోళన వ్యక్తం చేస్తూ.. మహిళలపై అత్యాచారాలను అరికట్టాలని డిమాండ్ చేసింది.
దిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) పాత్రపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు ఈ విషయంపై స్పందించకపోవడం ఏంటని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు రెండు ఒక్కటేనని రుజువు చేస్తున్నాయని అన్నారు. లిక్కర్ స్కామ్‌లో కవిత ప్రమేయంపై కేసీఆర్ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, మజ్లిస్ జెండాలు చూస్తే మహిళలు భయపడుతున్నారని మండిపడ్డారు. ఈ ధర్నా కార్యక్రమంలో బీజేపీ నేతలు డీకే అరుణ, విజయశాంతి, ఇతర ముఖ్యనేతలు పాల్గొననున్నారు.